News

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరముంది : ఉప ముఖ్యమంత్రి

181views

‘హిందూ విశ్వాసాలను, ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు, సంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కాదా? సూడో సెక్యులరిజం కాదా?’ అని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు.

తమిళనాడులోని తిరుప్పరకుండ్రం కొండపైనున్న దీపస్తంభంపై కార్తిక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడి దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో.. మద్రాస్‌ హైకోర్టు మదురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్‌ జీఆర్‌ స్వామినాథన్‌ ఇటీవల తీర్పునిచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశాలివ్వగా, తమిళనాడు ప్రభుత్వం తదనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డీఎంకే నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి జస్టిస్‌ స్వామినాథన్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ అందించారు. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పందించారు.

గతంలో ఇలా స్పందించలేదేం?
‘సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో శబరిమల వివాదంపై అక్కడి శతబ్దాల ఆచారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చినా ఏ న్యాయమూర్తీ అభిశంసనకు గురికాలేదు. ఆ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొన్నారే తప్ప, న్యాయమూర్తుల అభిశంసనకు రాజకీయ తీర్మానాలు చేయలేదు. ఇటీవల సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఓ కేసులో ‘మీరు విష్ణుమూర్తికి గొప్ప భక్తుడైనందున ఏం చేయాలో ఆ దేవుడినే అడగండి, ఆయన్నే ప్రార్థించండి’ అని వ్యాఖ్యానించినప్పుడు ఏ జవాబుదారీతనమూ లేకుండా పోయింది. తర్వాత ఆ ప్రధాన న్యాయమూర్తికి జరిగిన అవమానాన్ని అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి. తాజాగా తమిళనాడు ఉదంతంలో రాజకీయ వ్యవస్థ అందుకు భిన్నంగా స్పందిస్తోంది. ఓ సీనియర్‌ జడ్జి హిందువుల దీర్ఘకాలిక విశ్వాసాలను పాటించేందుకు అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఆయన్ను అభిశంసించాలని ఇండియా కూటమి డిమాండ్‌ చేస్తోంది. ఈ వైఖరి భయానక వివక్షను చాటుతోంది. ఈ పరిస్థితుల్లో హిందూ ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు అన్ని స్వరాలూ ఏకం కావాల్సిన అవసరముంది’ అని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.