News

పాకిస్థాన్‌లో షరీఫ్‌ వర్సెస్‌ మునీర్‌

143views

పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన ఆసిమ్‌ మునీర్‌కు మరిన్ని అధికారాలు కట్టబెడుతూ అక్కడి సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం కొత్తగా చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ -CDF పోస్టును సృష్టించినప్పటికీ ఇప్పటివరకు బాధ్యతలు అప్పగించలేదు. ప్రధానమంత్రి షెహ్‌బాజ్‌ షరీఫ్‌ ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారనే వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం, సైన్యం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను జైల్లో వేధింపులకు గురిచేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌-PTI పార్టీ మద్దతుదారులు ఇటీవల దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టారు. ఇస్లామాబాద్‌, రావల్పిండిల్లోనూ భారీ నిరసనలు చేపట్టిన నేపథ్యంలో స్థానికంగా పలు ఆంక్షలు విధించారు. పాక్‌ వీధుల్లో ఆందోళనలు కొనసాగుతున్నప్పటికీ రాజకీయ నాయకుల నుంచి ఎటువంటి స్పందన లేదు. సీడీఎఫ్‌గా ఆసిమ్‌ మునీర్‌ నియామకంపై సంతకం చేయాల్సిన ప్రధాని ప్రస్తుతం దేశంలో లేరు. బహ్రెయిన్‌ పర్యటనకు వెళ్లిన ఆయన.. అక్కడ నుంచి లండన్‌కు వెళ్తారని సమాచారం.

గడువు ముగిసినా..?
పాక్‌ ఆర్మీ చీఫ్‌గా మునీర్‌ మూడేళ్ల పదవీకాలం నవంబర్‌ 29తో ముగిసింది. ఇదే సమయంలో సైనిక నాయకత్వాన్ని ఏకీకృతం చేసే ఉద్దేశంతో 27వ రాజ్యాంగ సవరణ ద్వారా సీడీఎఫ్‌ పోస్టును సృష్టించారు. కానీ, ఇందుకు సంబంధించి ఇప్పటివరకు నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ప్రధాని షరీఫ్‌ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని జాతీయ భద్రతా సలహాదారు బోర్డు మాజీ సభ్యుడు తిలక్‌ దేవాషెర్‌ పేర్కొన్నారు. ఇటువంటి కీలక సమయంలో కావాలనే ప్రధాని విదేశీ పర్యటన చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

తిరుగుబాటు భయమా..?
సీడీఎఫ్‌ పోస్టు చేపడితే పాకిస్థాన్‌లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా మునీర్‌ నిలవనున్నారు. న్యాయపరమైన విషయాల్లో అధ్యక్షుడితో సమానంగా రక్షణ పొందుతారు. ఆయన్ను ప్రాసిక్యూట్‌ చేసే అవకాశం కూడా ఉండదు. ఇంతటి కీలక పోస్టు బాధ్యతల అప్పగింతపై ఎందుకు జాప్యం చేస్తున్నారనే విషయంపై పాక్‌లో చర్చ జరుగుతోంది. వైస్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ సహా పలు కీలక పోస్టుల్లో విశ్వాసపాత్రులను నియమించాలని నవాజ్‌ షరీఫ్‌, మరియం నవాజ్‌లు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికితోడు మునీర్‌ తిరుగుబాటు చేసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, పాక్‌ ప్రభుత్వం మాత్రం సైన్యంతో విభేదాలు ఉన్నాయని వస్తోన్న వదంతులను తోసిపుచ్చడం గమనార్హం.