
ఈ అపురూపమైన ఘట్టం కోసం భక్తులు యేడాది అంతా ఎదురు చూస్తారు. ఆలయం వెనక వైపు వున్న గిరి (కొండ) పై వెలిగిస్తారు. కార్తిక పౌర్ణమి ఘడియల్లో చేస్తారు. కార్తిక మాసంలో “కృత్తికా నక్షత్రం” వచ్చిన రోజున జరుపుతారు. దీనినే “కృత్తికా దీపోత్సవం” అని అంటారు.3 రోజుల పాటు ఈ జ్యోతి వెలుగుతూనే వుంటుంది. ఇది “జ్ఞాన జ్యోతి” అని సాధకుల విశ్వాసం.

ఈ కొండ ఎత్తు 2,668 అడుగుల ఎత్తు.ఈ దీపం కోసం లోహపు పాత్ర వాడుతారు. ఇందులో వత్తిని ఖాదీ వస్త్రంతో చేస్తారు.1,200 మీటర్ల వస్త్రం అవసరం అవుతుంది. దీనిని కొన్ని తరాలుగా అక్కడి రాజవంశం చేస్తూ వస్తోంది. అలాగే 4,500 కిలోల నెయ్యిని వాడతారు. ఈ దీపం 3 రోజుల పాటు వెలుగుతూనే వుంటుంది 24 కిలోమీటర్ల మేర కనిపిస్తుంది కూడా. ఇదో విశేషం. అయితే.. ఈ మహా దీపానికి కావాల్సిన దీపపు వత్తిని (గుడ్డ, వస్త్రం) దీపనాడార్ అనే వంశస్తులే తయారు చేస్తారు. ఇది ఇక్కడి సంప్రదాయం కూడా.

ఇక దీపోత్సవం సందర్భంగా అరుణాచల దేవాలయాన్ని సుందంగా ముస్తాబు చేస్తారు. అలాగే రమణాశ్రమాన్ని కూడా అంతే సుందరంగా తయారు చేస్తారు. సాయింత్రం కృత్తికా నక్షత్ర ఘడియ వచ్చే సరికి బాణాసంచా పేలుళ్లతో అరుణ గిరి శిఖరంపై జ్యోతి దర్శనమవుతుంది.అరుణాచల శివ… అరుణాచల శివ అంటూ భక్తులు నామ స్మరణం చేస్తారు. అప్పుడు అరుణాచలమే కైలాసం. ఆ శిఖరమే కైలాస గిరి. యావన్మంది భక్తులు ఆ శివుని “ప్రమథ గణాలు”.
కార్తిక దీప ఉత్సవాల వివరాలు ఇలా…
అరుణాచలంలో ఈ కార్తిక దీప ఉత్సవం అనేది అత్యంత ప్రముఖమైంది. 10 రోజుల పాటు ఇది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా 3 ప్రధాన ఘాట్టాలు వుంటాయి. భరణి దీపం, బ్రహ్మ తీర్థంలో తీర్థవరి ఉత్సవం, పౌర్ణమి రోజు సాయంత్రం కొండపై వెలిగించే మహాదీపం.





