News

‘రామాయణ’ ట్రైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు.. పాకిస్థాన్‌లోనూ జై శ్రీరామ్‌ గర్జన!

66views

రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్‌ రావణాసురుడిగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం‘రామాయణ’పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దర్శకుడు నితీష్‌ తివారీ రూపొందిస్తున్న ఈ మహా చిత్ర ట్రైలర్‌ను జూలై 30న బ్రహ్మముహూర్తంలో విడుదల చేయగా, అది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

భారతదేశంతో పాటు దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ ఈ ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. అక్కడి కొన్ని థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించగా, సినీ అభిమానులు, యూట్యూబర్లు, సినీ విశ్లేషకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్‌ మావియా ఉమర్‌ ఫారూఖీ మాట్లాడుతూ.. “రామాయణ ట్రైలర్‌ నా అంచనాలను మించిపోయింది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. ఇంత భారీ స్థాయిలో బాలీవుడ్‌ సినిమా నిర్మించడం ఆశ్చర్యంగా ఉంది” అని వ్యాఖ్యానించారు. ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందుతోందని తాను భావించానని, అయితే నెటిజన్లు రెండు భాగాల కలిపి రూ.4,000 కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్నారని చెప్పడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. “ఇది భారతీయ సంస్కృతి, హిందూ ధర్మానికి సంబంధించిన చిత్రం అయినప్పటికీ, ట్రైలర్‌ను చూసిన తర్వాత దాన్ని అభినందించకుండా ఉండలేకపోయాను” అని పేర్కొన్నారు.

ట్రైలర్‌లో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యష్‌ రావణుడిగా కనబరిచిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నటీనటుల అభినయం, సంభాషణలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌, సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఈ చిత్రం బాలీవుడ్‌కే కాదు, భారతీయ సినీ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలుస్తుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మహా ఇతిహాస చిత్రం తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 40 భాషల్లో పాన్‌-వరల్డ్‌ స్థాయిలో విడుదల చేయనున్న ఈ చిత్రం, భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటనుంది.

ధర్మానికి ప్రతీకగా, మర్యాదా పురుషోత్తముడైన శ్రీరాముడి ఆదర్శ జీవితం, సత్యం, ధైర్యం, కరుణ, వాగ్దానపాలన వంటి శాశ్వత విలువలను ప్రపంచానికి చాటి చెప్పిన రామాయణం.. మరోసారి వెండితెరపై నూతన వైభవంతో ఆవిష్కృతం కానుండటం హిందూ సమాజానికి గర్వకారణంగా నిలుస్తోంది.