
నయా భారత్ ఎలాంటి బెదిరింపులకు తలొగ్గదని, పౌరుల రక్షణ కోసం ఎంత దూరమైనా వెళ్తుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. శుక్రవారం ఉడుపిలోని ప్రసిద్ధ శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా లక్ష కంఠ భగవద్గీత పఠనంలో పాల్గొని గీతా పారాయణం చేశారు. అనంతరం భక్తులు, గాయకులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.
‘‘గీతలో శ్రీకృష్ణుడి బోధనలు ప్రతి యుగానికి సంబంధించినవి. మన జాతీయ విధానాన్ని అవి నిర్దేశిస్తాయి. ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కృష్ణుడు బోధించాడు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’, ‘సర్వజన్ హితయ’ అనే నినాదాలు గీత నుంచి స్ఫూర్తి పొందినవే. మహిళల రక్షణపై శ్రీ కృష్ణుడి సందేశమే.. రిజర్వేషన్ల చట్టానికి మార్గనిర్దేశనం. శాంతి, సత్యాన్ని సాధించడం కోసం అవసరమైతే దురాగతాలకు పాల్పడే వారిని అణచివేయాలని గీత మనకు బోధిస్తుంది’’ అని మోదీ తెలిపారు.
‘‘గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వాలు ఏమీ చేయకుండా చూస్తుండిపోయాయి. కానీ, నయా భారత్ అలా కాదు. ఎవరి ముందు తలవంచదు. దేశ రక్షణ విషయంలో ఎన్నటికీ వెనుకడుగు వేయదు. ఆపరేషన్ సిందూర్‌లో మన సంకల్పాన్ని ప్రపంచం చూసింది. మన మిషన్ సుదర్శన చక్ర.. శత్రువులను నాశనం చేస్తుంది’’ అని మోదీ వెల్లడించారు. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో దేశానికి సుదర్శన చక్ర భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయనున్నట్లు గతంలో ప్రధాని తెలిపిన సంగతి తెలిసిందే. రాబోయే పదేళ్లలో దేశంలోని అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా పూర్తిస్థాయి సురక్షా కవచం ఏర్పాటు చేయడమే ఈ మిషన్ ఉద్దేశం.
మోదీ అర్జునుడు..
అంతకుముందు ఉడుపిలో మోదీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం కృష్ణ ఆలయానికి చేరుకున్న ప్రధానికి పుతిగే మఠాధిపతి సుగుణేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అష్ట మఠాధిపతులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనకన కిండి (కిటికీ) నుంచి శ్రీకృష్ణుడి మూలవిరాట్‌ను మోదీ దర్శించుకున్నారు. అనంతరం లక్ష కంఠ భగవద్గీత పారాయణంలో ప్రధాని పాల్గొన్నారు. గీతలోని 10 శ్లోకాలను ఆయన అలవోకగా పఠించారు. ఈ సందర్భంగా మఠాధిపతి మాట్లాడుతూ ప్రధానిపై ప్రశంసలు కురిపించారు. మోదీ అర్జునుడంటూ కొనియాడారు. ప్రధాని సేవలను ప్రశంసిస్తూ.. ‘భారత భాగ్య విధాత’ అనే బిరుదును ప్రదానం చేశారు.





