
హలాల్ చేసిన మాంసాన్నే రైళ్లలో ప్రయాణికులకు అందిస్తుండటంపై వచ్చిన ఫిర్యాదు మీద ‘జాతీయ మానవ హక్కుల కమిషన్’ స్పందించి రైల్వేశాఖకు నోటీసు ఇచ్చింది. హలాల్ మాంసం వల్ల అనుచిత వివక్ష ఎదురవుతోందని, మానవ హక్కుల ఉల్లంఘనకు ఇది దారి తీస్తోందని భోపాల్‌కు చెందిన సునీల్ అహిర్‌వాల్ అనే ఫిర్యాదిదారు పేర్కొన్నారు. సునీల్ అహిర్వార్ దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని, NHRC సభ్యుడు ప్రియాంక్ కనూంగో ధర్మాసనం ఈ నోటీసు జారీ చేసింది.
ఈ పద్ధతి కారణంగా, హిందూ మరియు సిక్కు ప్రయాణీకులకు వారి మత విశ్వాసాలకు సరిపోయే ఆహార ఎంపికలు లభించలేదని, వారి ఎంపిక స్వేచ్ఛ, మతపరమైన హక్కులను ప్రభావితం చేసిందని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15. 19(1)(g), 21 మరియు 25 ప్రకారం సమానత్వం, వివక్షత లేని, వృత్తి స్వేచ్ఛ, గౌరవంగా జీవించే హక్కు మరియు మత స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందని ఆరోపించారు.
రైల్వేబోర్డు ఛైర్మన్‌కు నోటీసులు జారీచేయాలని, ఫిర్యాదిదారు లేవనెత్తిన అంశాలపై విచారణ జరిపించి.. రెండువారాల్లో చర్యా నివేదిక సమర్పించేలా చూడాలని రిజిస్ట్రీని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. హలాల్ చేసిన మాంసాన్నే వినియోగించాలనే నిబంధనను విధించలేదని రైల్వేబోర్డు అధికారి స్పష్టంచేశారు.





