News

భారతీయ సంస్కృతిలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాలి : ఉప ముఖ్యమంత్రి

214views

‘కొబ్బరి లేనిదే భారతీయ సంస్కృతి లేదు. మన సంస్కృతి, సంప్రదాయంలో భాగమైన కొబ్బరిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. కొబ్బరి చెట్టుని నమ్ముకున్న వాళ్లు రోడ్డున పడకూడదు. కొబ్బరి రైతు రోడ్డు ఎక్కకూడదు. కోనసీమ కొబ్బరి రైతాంగం సమస్యలపై సమగ్రంగా అధ్యయనం చేసి, శాశ్వత పరిష్కారం దిశగా ప్రణాళికలు రూపొందిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోనసీమ కొబ్బరి రైతులకు భరోసా ఇచ్చారు. 45 రోజుల్లో కొబ్బరి రైతుల సమస్యకు శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషిస్తామని, సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ తో మీ ముందుకు వస్తానని తెలిపారు.

బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం పరిధిలోని కేశవదాసుపాలెం వద్ద శంకరగుప్తం, కేశనపల్లి డ్రెయిన్ నుంచి సముద్రపు నీరు పోటెత్తడం కారణంగా పాడైన కొబ్బరి పంటను పరిశీలించారు. మోడుబారిన కొబ్బరి చెట్ల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. తలలు వాల్చేసిన కొబ్బరి చెట్లను పరిశీలించారు. శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఎన్నేళ్లుగా ఉంది? సమస్య ఎప్పటి నుంచి తీవ్రమైంది? శంకరగుప్తం డ్రెయిన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉంది? డ్రెయిన్ ఏమైనా ఆక్రమణలకు గురైందా అన్న వివరాలపై జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ , ఉద్యాన శాఖ అధికారులను ఆరా తీశారు. కొబ్బరి తోటలకు తిరిగి పునరుజ్జీవం పోసే అంశంపై శాస్త్రవేత్తలతో చర్చించారు. అనంతరం పంటలు నష్టపోయిన 13 గ్రామాల ప్రజలతో ముఖాముఖీ సమావేశం నిర్వహించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “కోనసీమ ప్రాంతంలో గతంలో పర్యటించిన సందర్భంలో శంకరగుప్తం డ్రెయిన్ సమస్య ఇంత తీవ్రంగా లేదు. సమస్య నా దృష్టికి వచ్చిన తర్వాత సమగ్ర అధ్యయనం జరిపి శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని భావించా. మోడు బారుతున్న కొబ్బరి చెట్లకు పునరుజ్జీవం పోయగలమా లేదా? కొత్తగా చెట్లు నాటితే ఎన్నేళ్లకు పంటకు వస్తాయి? ఈ లోపు రైతులకు ఉపాధిపరంగా ఏం చేయగలం? తదితర అంశాలపై సమగ్ర ప్రణాళిక అవసరం. సమస్యపై మూలాల నుంచి అవగాహన తెచ్చుకుంటే తప్ప శాశ్వత పరిష్కారం వెతకలేం అన్నారు.

కొబ్బరి రైతుల సమస్యలపై అధ్యయనానికి ప్రత్యేక కమిటీ
45 రోజుల్లో కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందిస్తాం. సంక్రాంతి తర్వాత యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తాం. ఈలోపు అధికారులు, కొబ్బరి రైతులతో మరో రెండు సమావేశాలు నిర్వహిస్తాం. 14 రోజుల తర్వాత తదుపరి సమావేశం నిర్వహిస్తాం. డ్రెయిన్ లో ఆక్రమణలు ఎంత ఉన్నాయి? గట్టు ఎంత మేర దెబ్బ తింది? ఏ మేరకు పూడిక ఉంది? అనే అంశాలతో పాటు శ్రీ బి.సి. రోశయ్య గారి రిపోర్టుపై కూడా అధ్యయనం చేసి నివేదిక రూపొందించండి. ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి సమస్య తీవ్రత తెలియజేసి పరిష్కార మార్గాలు అన్వేషించేందుకు ప్రత్యేక కమిటీ వేద్దాం. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు.

కేంద్రం దృష్టికి కొబ్బరి రైతుల సమస్యలు
కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగు అవుతోంది. ఇక్కడ కోకోనట్ బోర్డు ప్రాంతీయ కార్యాలయం మాత్రమే ఉంది. కోనసీమలో కోకోనట్ బోర్డు ఏర్పాటు చేసే అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్తాం. ఓఎన్జీసీ కార్యకలాపాలు కూడా సమస్యకు కారణం అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. స్థానిక పార్లమెంటు సభ్యులతో సహా మనకు 21 మంది ఎంపీలు ఉన్నారు. వారితో కలసి కోనసీమ కొబ్బరి రైతుల సమస్యను కేంద్రం ముందు ఉంచుతాం. సమస్య మూలాలు వెతికి శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు