
రామజన్మభూమి ఆలయ నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ -ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ మోహన్ భగవత్ ఇవాళ ఆలయ శిఖరంపై పవిత్ర కాషాయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ‘ధ్వజారోహణ్ ఉత్సవ్’ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ వేడుకతో ఆలయ నిర్మాణ ప్రక్రియ సంపూర్ణమైంది.
ఆలయం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ జెండా 22 అడుగుల పొడవు, 11 అడుగుల వెడల్పు ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఒక పారాచ్యూట్ నిపుణుడు దీన్ని తయారు చేశారు. సుమారు 2 నుంచి 3 కిలోల బరువుండే ఈ జెండా, ఎత్తైన ప్రదేశాల్లో బలమైన గాలులను సైతం తట్టుకునేలా రూపొందించబడింది. శ్రీరాముడి సూర్యవంశ వారసత్వానికి ప్రతీకగా సూర్యుడి చిహ్నంతో పాటు ఓం, కోవిదార వృక్షం గుర్తులు ఈ జెండాపై ఉన్నాయి.
రామమందిరంపై ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొనేందుకు అయోధ్యకు విచ్చేసిన మోదీకి, అయోధ్యలో ఘన స్వాగతం లభించింది. సాకేత్ కళాశాల హెలిప్యాడ్ వద్ద ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ భారీ రోడ్‌షోగా ఆలయానికి బయల్దేరి వెళ్లారు. రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో ప్రజలు, భక్తులు బారులు తీరి జైశ్రీరామ్, మోదీ-మోదీ నినాదాలతో హోరెత్తించారు. ప్రధాని కాన్వాయ్‌పై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ధ్వజారోహణకు ముందు ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలోని ‘సప్త మందిర్’గా పిలిచే మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, వాల్మీకి, అగస్త్య, దేవీ అహల్య, మాతా శబరి, నిషాద్‌రాజు గుహుని ఆలయాలను సందర్శించారు. అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామ దర్బార్ గర్భ గృహాల్లో ప్రత్యేక పూజలు చేశారు. చివరగా రామ లల్లా గర్భ గృహాన్ని దర్శించుకున్నారు..ఆ తర్వాత వేదమంత్రాల సాక్షిగా, అభిజిత్ లగ్నంలో భవ్యరామమందిరంపైన ధర్మధ్వజాన్ని మోదీ ఎగరవేశారు. 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటలపాటు ధ్యానం చేసిన సిక్కుల ఆరో గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందిన రోజు కూడా ఇదే కావడం విశేషం.
అయోధ్య ఆలయ శిఖరంపై ఆవిష్కరించిన ధర్మధ్వజం కేవలం జెండా కాదని, భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నమని ఈ సందర్భంగా మోదీ తనప్రసంగంలో తెలిపారు. జై శ్రీరామ్ నినాదంతో ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిన మోదీ, భారతీయ సాంస్కృతిక చైతన్యానికి అయోధ్య సాక్షిగా నిలిచిందని పేర్కొన్నారు. రామభక్తుల సంకల్పం సిద్ధించిందని తెలిపారు. రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి అని వెల్లడించారు.
వారు మాట్లాడుతూ..ధర్మ ధ్వజం శ్రీరాముడి సిద్ధాంతాలను ప్రపంచానికి చాటుతుందన్నారు. ధర్మ ధ్వజం ప్రపంచానికి ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇస్తుందని స్పష్టం చేశారు. కర్మ,కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని ధర్మ ధ్వజం వివరిస్తుందన్నారు. పేదలు,దుఃఖితులు లేని సమాజాన్ని మనం ఆకాంక్షిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఈ ధ్వజారోహణ కార్యకమ్రంతో శతాబ్దాల నాటి గాయాలు మానిపోయాయన్నారు. పేదలు, దు:ఖితులు లేని సమాజాన్ని మనం కోరుకుంటున్నాం, ధర్మధ్వజాన్ని దూరం నుంచి చూసిన రాముడిని చూసినంత పుణ్యం వస్తుంది, ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగారో అయోధ్య చెబుతుందని, రాముడు కులంచూడడు, కేవలం భక్తి మాత్రమే చూస్తాడు అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
భారత్ లో ప్రతి ఇంట్లోనూ, ప్రతి మనసులోనూ రాముడు ఉన్నాడన పేర్కొంటూ…మన చుట్టూ కొందరు ఇంకా బానిస భావజాలంతో ఉన్నారన్నారు. రాముడు కాల్పనిక వ్యక్తి అని వారంటున్నారనీ, అలాంటి బానిస భావజాలం ఉన్న వ్యక్తులకు తావు ఇవ్వొద్దని పేర్కొన్నారు. మానవ వికాసానికి అయోధ్యా కొత్త నమూనా ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ చెప్పారు.





