
( మార్గశిర శుక్ల పంచమి – శ్రీ గురు తేజ్ బహదూర్ బలిదాన్ దివస్ )
తొమ్మిదవ సిక్కు గురువు శ్రీ గురు తేజ్ బహదూర్ వ్యక్తిత్వం, ఆయన కర్తృత్వం దేశ చరిత్రలో ఉజ్వలంగా నిలిచిపోతాయి. ఆయన తండ్రి గురు హరగోవింద్ , తల్లి నానకీ. వైశాఖ కృష్ణ పంచమి(పూర్ణిమాంతం) నాడు ఈయన అమృత్‌సర్‌లో జన్మించారు. ఆయన సమయంలో భారతదేశంలోని చాలా భాగం మొగలాయిల పాలనలో ఉండేది. ఆ పరాయి పాలనను పరిసమాప్తం చేసేందుకు పూనుకున్నవారిలో గురు తేజ్ బహదూర్ కూడా ఒకరు. ఆయన వ్యక్తిత్వం సాధన, తపస్సు, త్యాగాలకు ప్రతీకగా నిలిస్తే, ఆయన కర్తృత్వం శారీరిక, మానసిక శౌర్యానికి గుర్తుగా నిలచింది.
`మనిషి మృత్యువుకు చాలా భయపడతాడు. ఆ భయం కారణంగానే మతం మార్చుకోవడానికి కూడా సిద్ధపడతాడు. జీవితంలో విలువలు వదిలిపెడతాడు. పిరికివాడుగా మారతాడు. చనిపోయేవాడికి ఆ భయం ఉండదు. దాని గురించి చింత ఎందుకు.’ అని అంటారు గురు తేజ్ బహదూర్.ఎలాంటి చింత, భయం లేకుండా ధర్మ మార్గంలో పయనించే సమాజాన్ని నిర్మించాలని గురు తేజ్ బహదూర్ భావించారు. ఆయన అటు తన కుటుంబం, ఇటు సమాజంలో సంస్కారాలను, విలువలను పెంపొందించారు. ధర్మం కోసం ప్రాణాలు సైతం త్యాగం చేశారు. విపత్కర పరిస్థితిలో కూడా నమ్మకాన్ని కోల్పోలేదు. ఆయన చేసిన కార్యం వల్ల దేశ ప్రజానీకంలో ధైర్యం పెరిగింది. బ్రజ భాషలో ఆయన ఇచ్చిన సందేశం భారతీయ సంస్కృతి, తత్వచింతన, ఆధ్యాత్మికతల మేలు కలయిక.
గురు తేజ్ బహదూర్ నివసించిన ఆనందపూర్ సాహిబ్ మొగలుల అన్యాయానికి, అత్యాచారాలకు ఎదురొడ్డి నిలిచింది. భారత్‌ను పూర్తి ఇస్లామికరణ చేయాలని ఔరంగజేబ్ భావించాడు. దేశం పూర్తిగా ఇస్లామికరణ చెందకుండా నివారించాలంటే మార్గం ఏమిటి? అందుకు ఒక్కటే మార్గం. ఎవరో ఒక మహాపురుషుడు దేశం, ధర్మం కోసం ఆత్మబలిదానం చేయాలి. అలాంటి బలిదానం వల్ల కలిగే ప్రజా చైతన్యం వల్ల మొగలాయిలు భయపడతారు. కానీ అలా బలిదానం ఎవరు చేస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం తేజ్ బహదూర్ పుత్రుడైన శ్రీ గోవింద్ రాయ్ చెప్పారు. ‘మీకంటే మహాపురుషుడు ఎవరున్నారు?’ అని పలికారు. ఔరంగజేబ్ సైన్యం గురు తేజ్ బహదూర్‌తో పాటు మరో ముగ్గురిని బంధించింది. అందరినీ ఢిల్లీ తీసుకువచ్చారు. అక్కడ వారిని అమానుషంగా చిత్రహింసలకు గురిచేశారు. ఇస్లాం స్వీకరించాలని భయపెట్టారు, బెదిరించారు. నానాయాతనలకు గురిచేశారు. మతగురువును చేస్తామని, భోగభాగ్యాలకు లోటు ఉండదని ఆశపెట్టారు. అయినా ముగ్గురు శిష్యులతోపాటు గురు తేజ్ బహదూర్ ధర్మాన్ని వదలలేదు.
ఢిల్లీ చాందిని చౌక్‌లో గురు తేజ్ బహదూర్ ఎదురుగానే ఒక శిష్యుడైన భాయి మతిదాస్‌ను రంపంతో నిలువునా చీల్చారు. మరొక శిష్యుడు భాయి దియాలాను సలసల కాగే నూనెలో వేశారు. భాయి సతిదాస్‌ను పత్తిలో మూటకట్టి దానికి నిప్పు పెట్టారు. ఈ క్రూర, అమానుష చర్యలు చూసి గురు తేజ్ బహదూర్ భయపడతారని వాళ్ళు అనుకున్నారు. అన్యాయం, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడటమే ధర్మమని గురు తేజ్ బహదూర్ భావించారు. అందుకనే ఆయన చలించలేదు. దానితో కాజీ ఆదేశించడంతో ఒక హంతకుడు గురు తేజ్ బహదూర్ తలను నరికేశాడు. ఆయన ఈ ఆత్మబలిదానంతో దేశమంతటా ఒక చైతన్యం వచ్చింది. ఈ నవంబరు 25న గురు తేజ్ బహదూర్ బలిదాన దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆయన చూపిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి.





