News

215 మంది విద్యార్థులను కిడ్నాప్ చేసిన ఇస్లామిక్ తీవ్రవాదులు..

178views
నైజీరియాలో ఇస్లామిక్ తీవ్రావాదులు చేస్తున్న కిడ్నాప్‌ల పరంపర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే 25 మంది విద్యార్థులను అపహరించుకెళ్లిన దుండగులు.. తాజాగా 215 మంది చిన్నారులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. ఇది వారంలో జరిగిన రెండో అపహరణ కాగా.. విద్యార్థుల తల్లిదండ్రులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అప్రమత్తమైన నైజీరియా సర్కారు 47 కళాశాలలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Islamic extremists
అసలేం జరిగిందంటే?
క్రైస్తవ సంఘాల సమాఖ్య ఆఫ్ నైజీరియా (CAN) ప్రకారం..నవంబర్ 21వ తేదీ తెల్లవారుజామున ఈ సంఘటన జరిగింది. నైజర్ రాష్ట్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో ఈ అపహరణ జరిగింది. ఆ సమయంలో పాఠశాల సెక్యురిటీ మాత్రమే అందుబాటులో ఉంది.గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి, తుపాకులు చేత పట్టుకుని వచ్చి మరీ పిల్లలను కిడ్నాప్ చేశారు. పిల్లలు 7 నుండి 17 సంవత్సరాల మధ్య వయసుగలవారని అంచనా.. కేవలం విద్యార్థులనే కాకుండా ఉపాధ్యాయులను సైతం అపహరించారు. మొత్తంగా 215 మంది విద్యార్థులను, 12 మంది ఉపాధ్యాయులను కిడ్నాప్ చేశారు. అదృష్టవశాత్తు కొందరు పిల్లలు అపహరణకు గురి కాకుండా తప్పించుకోగలిగారని సీఏఎన్ చైర్మన్ రెవరెండ్ బులుస్ దౌవా యోహన్నా తెలిపారు. కాథలిక్ క్రైస్తవ సంస్థ నిర్వహిస్తున్న ఈ మాధ్యమిక పాఠశాలలో అదే క్యాంపస్ లో మరో ప్రాథమిక పాఠశాల కూడా :ది. అయితే దాడి చేసిన వారు అక్కడికి వెళ్లలేదు. అయితే 2024 మార్చిలో కడునా రాష్ట్రంలో 200 మందికి పైగా విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత జరిగిన అదిపెద్ద కిడ్నాప్ ఇదే..కేవలం ఇది మాత్రమే కాకుండా ఈ వారం మొదట్లో కూడా మరో కిడ్నాప్ జరిగింది. సోమవారం రోజు కెబ్బి రాష్ట్రంలోని ఒక బోర్డింగ్ పాఠశాల నుంచి 25 మంది బాలికలను ముస్లిం తీవ్రవాదులు అపహరించారు. అదే రోజున క్వారా రాష్ట్రంలో ఒక చర్చిపై దాడి చేసి 38 మంది భక్తులను కిడ్నాప్ చేసి.. వారిని విడుదల చేసేందుకు డబ్బులు అడిగారు. ముఖ్యంగా ఒక్కో భక్తుడికి 100 మిలియన్ నైరా (భారత కరెన్సీ ప్రకారం రూ.61,69,348) చొప్పున డిమాండ్ చేసినట్లు చర్చి అధికారులు తెలిపారు.
భద్రతా హెచ్చరికల ఉల్లంఘన
నైజర్ రాష్ట్ర ప్రభుత్వం ఈ దారుణమైన సంఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దాడులు జరిగే అవకాశం ఉందని ముందస్తు నిఘా సమాచారం ఉన్నప్పటికీ.. సెయింట్ మేరీస్ పాఠశాల, బోర్డింగ్ పాఠశాలలను మూసివేయాలనే ప్రభుత్వ ఆదేశాన్ని విస్మరించింది. దీని కారణంగానే విద్యార్థులు, సిబ్బంది అనవసరమైన ప్రమాదానికి గురయ్యారని రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఇదిలా ఉండగా కిడ్నాప్ చేయబడిన పిల్లల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైజర్ స్టేట్ కాథలిక్ అసోసియేషన్ ప్రతినిధి డేనియల్ అటోరితో సహా క్రిస్టియన్ అసోసియేషన్ ఆఫ్ నైజీరియా (CAN), పిల్లలందరూ సురక్షితంగా తిరిగి వచ్చేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరింది. ఈ సంఘటన జరిగిన వెంటనే, సైన్యం , భద్రతా దళాలు స్కూల్ కు వచ్చాయి, అదనపు దళాలను మోహరించి, తీవ్ర శోధన ఆపరేషన్ నిర్వహించాయి. అపహరణకు గురైన పిల్లలను సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం , స్థానిక సంస్థలు కృషి చేస్తున్నాయి. పోలీసులు, సైనిక బలగాలు కిడ్నాప్ అయిన వారిని రక్షించేందుకు సమీపంలోని అడవులలో గాలింపు చర్యలు చేపట్టాయి.