
భారతీయుల్లో జాతీయభావం అప్పటికి సరిగా మొగ్గతొడగలేదు. ఆధునిక చరిత్రకారులు ప్రథమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా పేర్కొనే సిపాయిల తిరుగుబాటు జరగలేదు. కానీ అంతకు పదేళ్ల క్రితమే నాటి కడప జిల్లా ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన దొరవారి నరసింహారెడ్డి ఆంగ్లేయులపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. నేటికి సరిగ్గా 177 ఏళ్ల క్రితం ఉరికొయ్యను ముద్దాడి ఆయన భావి భారత జాతీయోద్యమానికి స్ఫూర్తిగా, దిక్చూచిగా నిలిచారు. నరసింహారెడ్డి 24 నవంబర్ 1806వ సంవత్సరంలో కర్నూలు జిల్లాలోని రూపనగుడి గ్రామంలో జన్మించి ఉయ్యాలవాడలో పెరిగి పెద్దవాడయ్యాడు. వీరి తల్లిదండ్రులు సీతమ్మ, పెద్దమల్లారెడ్డి జాగిర్దారుల కుటుంబానికి చెందినవారు.
బ్రిటిష్ వలస పాలకులు 19 శతాబ్ది ప్రారంభంలో రాయలసీమలో రైతువారి విధానం అమలు చేయడానికి గాను పాలేగాళ్లను అణిచివేసే కార్యక్రమానికి నాంది పలికారు. ఇందులో భాగంగా బ్రిటిష్ పాలకులు పాలెగాళ్ల వ్యవస్థను రద్దు చేసి వారికి నెలవారీ భరణాలను ఏర్పాటు చేశారు. 1846 జూన్‌లో నరసింహారెడ్డి తన నెలసరి భరణం కొరకు తన అనుచరుణ్ని కోయిలకుంట ఖజానాకు పంపగా, అక్కడి తహసిల్దార్ ఆ వ్యక్తిని దుర్భాషలాడి నరసింహారెడ్డి వస్తేనే భరణం ఇస్తానని చెబుతాడు. అప్పటికే ఆంగ్లేయుల దాష్టీకం, అధికార మదోన్మాద వైఖరి, పీడించి పన్నులు వసూలు చేయడం వంటి దురాగాతాలతో విసిగి వారిపై కసిగొని ఉన్న నరసింహారెడ్డికి తహసిల్దార్ చేసిన అవమానం అగ్నికి ఆజ్యం పోసినట్లైంది. వెంటనే తనకు అత్యంత విశ్వాసపాత్రులైన ‘కలవాటాల’ బోయదండును పిలిపించుకొని కోవెలకుంట్ల ట్రెజరీ పై 1846 జూన్ 10న ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి దాడి చేశాడు. తహసిల్దార్‌ను, ట్రెజరీ అధికారిని చంపి వారి తలలను ఒక పాడుపడ్డ శివాలయంలో దాచాడు.
బ్రిటిష్ ప్రభుత్వం ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని పట్టుకునేందుకు సైన్యాన్ని రంగంలోకి దింపింది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్ వీరిద్దరి నాయకత్వాల్లో వచ్చిన దళాలు నరసింహారెడ్డిని పట్టుకోలేక వెనుదిరిగాయి. నరసింహారెడ్డిని పట్టి ఇస్తే వేయి రూపాయల బహుమానం ఇస్తామని బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఇదే సమయంలో నరసింహారెడ్డి వేల కొలది సైనికులను సమకూర్చుకొని గిద్దలూరు దగ్గర వాట్సన్‌తో ఘోర యుద్ధం చేశాడు. ఈ యుద్ధంలో నరసింహారెడ్డి సైన్యం ఎంతో నష్టపోయింది. అయినా పట్టువదలక జూలై 23న మరలా కెప్టెన్ వాట్సన్‌తో పోరాడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలాడు. నరసింహారెడ్డిని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో కుట్రకు తెరతీసిన ఆంగ్లేయులు, ఆయన వద్ద పని చేసే వంట మనిషికి డబ్బు ఆశ చూపి ఆమె సహాయంతో సంజామల మండలం రామభద్రుని పల్లె సమీపంలోని జగన్నాథ కొండపై ఉండగా నరసింహారెడ్డిని పట్టుకున్నారు. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం అతడిని బందిపోటుగా చిత్రీకరించి 1847 ఫిబ్రవరి 22న కోవెలకుంట్ల పట్టణ సమీపంలోని జురెరు ఒడ్డున ఉరిశిక్ష అమలు చేసింది. నరసింహారెడ్డి తరహాలో మరెవరు విప్లవ మార్గంలో పయనించకుండా చేసేందుకు ఆయన తలను కోట గుమ్మానికి వేలాడదీశారు. దాదాపు 30 ఏళ్ల పాటు ఆ తల అలానే వేలాడేదని చరిత్రకారుల మాట.
ఆంగ్లేయులపై దేశంలోనే తొలిసారిగా స్వరాజ్య సమర శంఖారావాన్ని పూరించి, వారి పాలిట సింహ స్వప్నమై, రాయలసీమ ముద్దుబిడ్డగా, రేనాటి వీరుడిగా, సైరా నరసింహారెడ్డిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఖ్యాతి పొందారు. శిస్తు వసూలులో తెల్లదొర పెత్తనంపై దండయాత్ర చేసి, చివరికి ఉరికొయ్యకు వేలాడి స్వాతంత్ర్యోద్యమానికి బీజం వేశారు. ‘సైరా నరసింహారెడ్డి…నీ పేరే బంగారు కడ్డీ’ అనే జానపద గేయం రాయలసీమ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపింది. ఇప్పటికీ ఆయన స్వరాజ్య సమరం సాగించిన ప్రాంతంలో నరసింహారెడ్డిపై జానపద గేయాలు నేటికీ వినిపిస్తూనే ఉంటాయి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నేటి యువతరానికి ఆదర్శ మూర్తి, ప్రాత:స్మరణీయుడు.





