Newsvideos

పరాక్రమానికి ప్రతీక లచిత్ బోర్ఫూకన్

62views

భారత్‌లో ఢిల్లీ సుల్తాన్లు, మొఘల్ ఆక్రమణ ప్రయత్నాలను పదేపదే తిప్పికొట్టిన ఏకైక రాష్ట్రం అసోం. ఏకంగా 17 దురాక్రమణ ప్రయత్నాలను ఆరాష్ట్రం నిర్వీర్యం చేసింది. భారత్‌లో ఈశాన్య ప్రాంతాన్ని ముస్లిం దండయాత్రల నుంచి లచిత్ బోర్ఫూకన్, ఇతర సాహస సేనాపతులు, రాజులు కాపాడారు. లచిత్ బోర్ఫూకన్ అహోం రాజధానికి సైన్యాధిపతిగా ఉండేవాడు. మొఘల్ దళాలు 1671లో చేసిన సుదీర్ఘ ఆక్రమణ ప్రయత్నాన్ని తిప్పికొట్టిన సరాయిఘాట్ యుద్ధంలో రామసింగ్ I నేతృత్వంలో వీరోచిత పోరాటం చేసి కామరూప్‌ని తిరిగి సాధించిన ఘనత లచిత్‌దే.

లచిత్ బోర్ఫూకన్ నేడు అస్సాంగా పిలవబడుతున్న ఒకనాటి అహోం రాజ్యంలో 17వ శతాబ్దంలో జన్మించారు. అతని అసలు పేరు లచిత్ డెకా. లచిత్ తన చిన్ననాటి నుంచే సర్వ సైన్యాధికారి అయిన తండ్రి మొమై తములి బోర్బరువా సారధ్యంలో సైనిక శిక్షణ పొందారు. అహోం రాజు జయధ్వజ సింఘా వద్ద సోలాధర బారువాగా ఉన్న లచిత్ అంచెలంచెలుగా ఎదిగి చక్రధ్వజ హయాంలో బోర్ఫుకన్‌గా ఎదిగారు. అలా లచిత్ డెకా కాలక్రమేణా లచిత్ బోర్ఫుకన్‌గా ప్రసిద్ధి చెందారు.

లచిత్ బోర్ఫుకన్ ముందుండి పోరాటానికి నాయకత్వం వహించడమే కాక ప్రతి పోరాటంలో మొఘలులను ఓడించాడు. తన సైనిక పరాక్రమంతో అస్సాం సరిహద్దుల్లో కూడా మొఘల్ సైన్యం ఆనవాళ్లు లేకుండా వారిని వెళ్లగొట్టాడు. మొఘల్ సైన్యాధికారి రాజారామ్ సింగ్ తన విరోధి పోరాటపటిమకు విస్మయం చెందడమే కాక ఆయనను ఓడించడానికి ఆయన యుద్ధ ప్రణాళికలో ఎటువంటి లొసుగులు, అవకాశాలు కనిపించలేదని లచిత్‌ను ప్రశంసించాడు. గౌహతి రాజభవనంపైన అహోం జెండాను తిరిగి స్థాపించిన లచిత్ ఘనత, విశిష్టత అటువంటిది.

సరాయిఘాట్‌లో నిర్ణయాత్మక యుద్ధం జరిగిన సంవత్సరం తరువాత 1672 ఏప్రిల్‌లో లచిత్ తన కాలిబోర్ ప్రధాన కార్యాలయంలో వీరమరణం పొందారు. ప్రాణం కన్నా దేశమే మిన్న అనే విధంగా అసాధారణమైన వీరత్వం ప్రదర్శించిన లచిత్ బోర్ఫుకన్ తరతరాల అస్సామీలకు ప్రేరణ. ధైర్యంగా పోరాడటానికి, ఓటమి అంచునుండి గెలవటానికి, అస్సాంలోని అన్ని వర్గాల ప్రజలు లచిత్ పేరును స్మరించుకుంటారు. మొఘలులకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడడమే కాకుండా, సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్య పాత్ర పోషించిన భరతమాత ముద్దుబిడ్డ లచిన్ బోర్ఫుకన్‌ను గుర్తు తెచ్చుకునేందుకు ప్రతి నవంబర్ 24న లచిత్ దివస్‌గా జరుపుకుంటున్నాము. ధైర్యం, రాజనీతజ్ఞతకు నిలువెత్తు ఉదాహరణగా నిలిచే లచిత్ బర్ఫుకన్ సదా స్ఫూర్తిదాయకం.