News

తిరుపతిలో ఘనంగా ప్రారంభమైన 13వ పంచగవ్య వైద్య మహాసమ్మేళనం

171views

గోమాత సంరక్షణ, గోసేవ, గోవైద్యం, గోమాత వేదం, శాస్త్రీయ ప్రయోగాలతోనే ఆరోగ్య భారత్‌ సాధ్యపడుతుందని పంచగవ్య విద్యాపీఠం గురుకులపతి గవ్యసిద్ధాచార్య నిరంజన్‌ వర్మ తెలిపారు. దేశవ్యాప్తంగా గోమాత రక్షణపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో తిరుపతిలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న 13వ పంచగవ్య జాతీయ వైద్య మహాసమ్మేళనంలో ఆయన మాట్లాడారు. పంచగవ్య వైద్యశాస్త్రంపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు, గవ్య ఉత్పత్తి, గోశాల నిర్వాహకులు, గో రక్షకులు సుమారు 200 మంది పాల్గొన్నారు. అలాగే గో విజ్ఞానానికి సంబంధించిన కొత్త విషయాలపై పరిశోధన జరిపిన విద్యార్థులు వారి పత్రాలు అందజేశారు. ‘గోమాత సే నిరోగి భారత్‌’ అనే నినాదంతో సదస్సును ప్రారంభించారు. గవ్యసిద్ధ అంఖ పత్రికను విడుదల చేశారు. మొదటి రోజు ‘గోసేవ శ్రీవేంకటేశ్వర స్వామి, నాలుగు వర్ణాల గృహస్థ పాలకుడు’ అనే అంశంపై చర్చించారు. హేమంత్‌ శేటే శాఖాహార ప్రాముఖ్యాన్ని వివరించారు. డాక్టర్‌ సత్యపాల్‌ ప్రకాష్‌ వర్మ పంచగవ్యలో నానోటెక్నాలజీ, ఆధునిక శాస్త్రంలో దాని అద్భుతమైన అనువర్తనాలపై చర్చించారు. ఐఐసీటీ ఎమెరిటస్‌ సైంటిస్ట్, ఏసీఎస్‌ఐ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి.జయతీర్థరావు పంచగవ్య ఉప ఉత్పత్తులు, వాటి ఉపయోగాలను పంచుకున్నారు. పంచగవ్య నుంచి తయారైన ఎరువుల వినియోగం, రైతులకు లబ్ధి తదితర వివరాలను శ్రీవిజయ్‌ రామ్‌ జీ వివరించారు. ప్రపంచవ్యాప్తంగా గో-శాస్త్రీయ జ్ఞానాన్ని వ్యాప్తి చేయడంతో పాటు గో ఉత్పత్తులను ప్రోత్సహించాలని అంతర్జాతీయ జర్నలిస్ట్, పంచగవ్య విద్యాపీఠం ప్రొ-వైస్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ కుమార్‌ రాకేష్‌ పిలుపునిచ్చారు. భారతీయ గో ఉత్పత్తి రంగంలో పెరుగుతున్న వ్యాపార అవకాశాలను మాజీ ఎంపీ ప్రదీప్‌ గాంధీ ప్రస్తావించారు. ఈ సదస్సులో పంచగవ్య విద్యాపీఠం ఉప-గురుకులపతి డా.కమల్‌ తావోరి, జగద్గురు పిపద్వార్చార్య బలరామ్‌ దేవాచార్య మహరాజ్, బృందావన్, పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద్‌ సరస్వతి స్వామి, శ్రీధరాచార్య మహరాజ్, తితిదే బోర్డు సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి, హిందూ మునాని వైఎస్‌ ప్రెసిడెంట్‌ బ్రహ్మచారి తిరు పరమేశ్వరన్, విజయ్‌ శేఖర్, మోహన్‌లాల్‌ బజాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పంచగవ్య నిపుణులు సిద్ధమవుతున్నారు
పంచగవ్య వైద్యం 2000 సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చింది. గత 13 ఏళ్లుగా పీఠం ద్వారా శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 23 శిక్షణ కేంద్రాల ద్వారా సుమారు 500 మంది నిపుణులు తయారయ్యారు. ఏడాది సర్టిఫికెట్‌ కోర్సులు, రెండేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పంచగవ్య వైద్యానికి ప్రచారం కల్పించేందుకు ఏటా ఒక్కో రాష్ట్రంలో సమ్మేళనం నిర్వహిస్తున్నాం. -కె.నిరంజన్‌వర్మ, పంచగవ్య విద్యాపీఠం వ్యవస్థాపకులు