
( 15 నవంబర్ – 150వ జయంతి )
బిర్సా ముండా భారతీయ వనవాసీల స్వాతంత్య్ర సమరయోధుడు, జానపద నాయకుడు. ఆంగ్లేయుల దుష్ట పాలన నుండి భారతదేశాన్ని విముక్తపోరాటాలు చేసిన యోధులలో పేరెన్నిక కన్నవాడు. జీవించినది అతి కొద్ది కాలమైన అనంతమైన చరిత్రను సృష్టించుకున్నాడు. పాతిక సంవత్సరాల వయసులోనే కీర్తిశేషుడైనప్పటికీ, జనజాతి ప్రజల హృదయాల్లో ‘భగవాన్ బిర్సా’ ముండాగా ఈనాటికి జీవిస్తున్న చిరంజీవి ఆయన.
బిర్సా ముండా, జార్ఘండ్ లోని ఖుంతీ జిల్లా, ఉలిహతు గ్రామంలో నవంబర్ 15, 1875, గురువారం రోజున జన్మించాడు. తండ్రి సుగుణా ముండా, తల్లి కర్మి హాటు.అహుబటు గ్రామంలో తన మామయ్య ఇంట్లో ఉండేవాడు. సమీపంలోని సాల్గా గ్రామంలో ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. అనంతరం బూర్జు మిషన్ స్కూలులో చేరాడు. అతడి ప్రతిభను గమనించి స్కూలు యాజమాన్యం చైబాసాలో మరో మిషనరీ పాఠశాలకు పంపించారు. ఇందుకోసం ఆయన క్రైస్తవంలోకి మారాల్సి వచ్చింది. అక్కడ ఆయన పాశ్చాత్య దేశాల చరిత్ర, ఆధునిక శాస్త్రవిజ్ఞానాన్ని ఆకళింపు చేసుకున్నాడు. ఫలితంగా బ్రిటిష్ పాలకుల అణిచివేత, దోపిడిని అర్థం చేసుకున్నాడు. ఆయన స్కూల్లో జరిగే వక్తృత్వం, చర్చా కార్యక్రమాల్లో ఎప్పుడూ వనవాసీల నీరు, అడవి, భూమిహక్కుల గురించి ఎంతో గట్టిగా వాదించేవారు.
ఆంగ్లేయులు చేసి అరాచకాల వల్ల ఎదుర్కొం టున్న దుస్థితిని గురించి బాగా ఆలోచించేవాడు. అత్యంత పిన్న వయసులోనే చరిత్రను, దాని పూర్వాపరాలను ఆకళింపు చేసుకున్నాడు. బ్రిటిష్ వారు చేసే కుట్రలను, కుతంత్రాలను వనవాసీలకు తెలియజేసేవాడు. వారిలో స్వాతంత్య్ర పిపాసను రగిలించేవాడు. అప్పట్లో బ్రిటిష్ పాలకులు వనవాసీల భూములపై అధిక పన్నులు వసూలు చేసేవారు. పన్ను చెల్లించలేని వారి భూములను లాక్కునేవారు. అదేమని ఎదురు తిరిగిన వారిని నానా బాధలు పెట్టేవారు. బ్రిటిష్ వాళ్లు పెట్టే బాధలు పడలేక వనవాసీల్లోని చాలా మంది అస్సాంలోని తేయాకు తోటలకు కూలీలుగా పనిచేయడానికి వెళ్లేవారు.
బిర్సా ఒకరోజు ముండాతెగ పెద్దలతో కలిసి తమ భూములను తిరిగి ఇచ్చేయాలని తెల్లదొరలపై ఒత్తిడి చేశాడు. దాంతో మిషనరీ పాఠశాల ఆయనను బయటకు పంపించి వేసింది. బిర్సా దీన్ని సవాలుగా తీసుకున్నాడు. పాఠశాల యాజమాన్యం ఎదుటే నుదుటన తిలకం ధరించాడు. యజ్ఞోపవీతాన్ని కూడా ధరించారు. ఇకపై క్రైస్తవంలోకి ఒక్క వన వాసిని కూడా మారకుండా చూస్తానని ప్రతిన బూనాడు. ఆయన వ్యక్తిత్వంపై అంతకు ముందు జరిగిన సంతాల్ ఉద్యమం, చులార్ ఉద్యమం ప్రభావం చూపాయి. బ్రిటీషర్ల వల్ల ముండా, సందాల్, ఓరియన్, కోల్ వనవాసీ తెగలు ఎప్పటికైనా ప్రమాదంలో పడే అవకాశం ఉందని భావించాడు. ‘బిర్సాయిత్’ మతాన్ని స్థాపించాడు. ఆయా తెగలకు ఆధ్యాత్మిక విషయాలని బోధించసాగాడు, ఐక్యమత్యంగా ఉండవలసిన అవసరాన్ని స్పష్టం చేశాడు. ప్రకృతి వైద్యంతో అనారోగ్యం పాలైన ఎంతోమంది వనవాసీలకు స్వస్థత చేకూర్చాడు. దీంతో వనవాసీలు బిర్సా ముండాను దేవుడిగా కొలవడం ప్రారంభించారు. ఆయన్ను ధర్తిలాభ అని పిలిచేవారు.
డిసెంబర్, 1899లో బిర్సా ముండా తెల్ల దొరలకు వ్యతిరేకంగా ఉల్ గులాన్ పేరిట నిర్వ హించిన కార్యక్రమంలో 7,000 మంది పాల్గొన్నారు. తెల్ల దొరలు బిర్సా ఆచూకీ చెప్పాలంటూ వనవాసీలపై అకృత్యాలను ఆరంభించారు. వీటిని సహించలేకపోయిన ఆయన అనుచరులు జనవరి 5, 1900న ఎక్కేడి ప్రాంతంలో ఇద్దరు పోలీసుల్ని హతమార్చారు. దీంతో రగిలిపోయిన పోలీసులు ఆయన కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 3,1900న జంకో పాయి అటవీ ప్రాంతంలో అరెస్టు చేశారు. రాంచీ జైలుకి తరలించారు.
ఎప్పటికైనా తమకు ప్రమాధకారిగా మారతాడని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం బిర్సా ముండాను జూన్ 9, 1900న విష ప్రయోగంతో చంపేసింది. మలేరియాతో మరణించాడు అంటూ ప్రచారం చేసింది. బిర్సా చేసిన పోరాటం వల్ల 1908లో చోటా నాగపూర్ కౌలు చట్టం అమల్లోకి వచ్చింది. నీరు, అడవి, భూమి పైన వారసత్వ హక్కుల పరిరక్షణ కోసం ప్రారంభమైన పోరాటాలు ఒక దాని తర్వాత ఒకటి కొనసాగుతూనే ఉన్నాయి.ఇప్పటికి జార్ఖండ్, బీహార్, పశ్చామ బెంగాల్, ఒరిస్సా రాష్ట్రాలలో వనవాసీలు ఆయన్ను ఇప్పటికీ భగవాన్ బిర్సా ముండాగా పూజిస్తున్నాయి. బిర్సా ముండా స్మృత్యర్థం రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా విమానాశ్రయంగా పేరు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఆయన జయంతిని జనజాతీయ గౌరవ దివస్‌గా నిర్వహిస్తోంది.





