
అమెరికన్ చట్టసభ సభ్యులని ప్రభావితం చేయడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లాబీయింగ్ చేస్తున్నట్లు విమర్శలు వచ్చాయి. అమెరికాలోని అగ్రశ్రేణి లాబీయింగ్ సంస్థలలో ఒకటైన స్క్వైర్ పాటన్ బోగ్స్ దగ్గర జనవరి 16 న సంఘ్ లాబీయిస్ట్ గా నమోదు చేసుకున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. 2025 మొదటి మూడు త్రైమాసికాలలో, US సెనేట్ మరియు ప్రతినిధుల సభలోని అధికారులను లాబీయింగ్ చేయడానికి స్క్వైర్ పాటన్ బోగ్స్ కంపెనీకి ఆరెస్సెస్ ఏకంగా $330,000 చెల్లించిందని కూడా అర్థం పర్థం లేని విమర్శలకు దిగారు.
అయితే.. దీనిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ఎక్స్ మాధ్యమంగా స్పందించారు. “రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భారతదేశంలో పనిచేస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఏ లాబీయింగ్ చేసే ఏ సంస్థతోనూ మాకు సంబంధాలు లేవు” అని ప్రకటించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా సమాజం నుంచి విశేషమైన స్పందన వస్తోంది. దీనిని చూసి, సైద్ధాంతిక విరోధులకు గానీ, సంఘ్ వ్యతిరేకులకు గానీ ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ కారణంగానే సంఘ్ పై లేని పోని విమర్శలు, ఆరోపణలకు దిగుతున్నారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఓ సేవ, సాంస్కృతిక సంస్థ. నిత్య శాఖ అన్న మాధ్యమంగానే వ్యక్తి నిర్మాణం జరుగుతుందని, దీని ద్వారా దేశ నిర్మాణం సాధ్యమవుతుందని బలంగా నమ్మే సంస్థ కూడా. రాజకీయ సంస్థా కాదు, అధికారం కోసం పాకులాడే సంస్థ అంతకంటే కాదు. అలాంటప్పుడు రాజకీయ నాయకులు, రాజకీయ రంగం చేసే లాబీయింగ్ ని ఓ సేవా సంస్థ, సాంస్కృతిక సంస్థ ఎందుకు చేస్తుంది? అంతేకాకుండా ఆరెస్సెస్ కేవలం భారత దేశానికి మాత్రమే పరిమితమైన సంస్థ. అమెరికాతో ఏం పని వుంటుంది? సంఘ్ కి ప్రస్తుతం అన్ని దిశలా ఆమోదం లభిస్తోంది. ప్రజల నుంచి ఆదరణ పెరిగింది. సంఘ్ వంద సంవత్సరాలుగా చేస్తున్న కార్యం ప్రజలందరికీ జీర్ణమైంది. దీనిని చూసి ఓర్వలేకే ఇలాంటి అర్థం పర్థం లేని ఆరోపణలకు దిగుతున్నారు.





