
( నవంబర్ 15 – భగవాన్ బిర్సా ముండా జయంతి )
భారతదేశాన్ని బ్రిటిష్ పాలకుల నుండి విముక్తి కల్పించేందుకు ఎందరో వనవాసీ వీరులు పోరాటం చేశారు. వారిలో అత్యంత ప్రముఖులు బిర్సా ముండా. ఆయన జయంతిని జన్ జాతీయ గౌరవ్ దివస్‌గా ప్రతి ఏటా నవంబరు 15న పాటిస్తున్నాం. వనవాసీల్లో పోరాట భావాలను రగిలించిన తొలి వీరుడు బిర్సా ముండా. నేటి జార్ఖండ్‌లో వనవాసీల రాజ్యాన్ని తెచ్చేందుకు బిర్సా ముండా సమర శంఖాన్ని పూర్తించారు. ఈయన తన వనవాసీ ప్రజలకు ‘రాణి రాజ్యానికి అంతం పలుకుదాం-మన రాజ్యాన్ని స్థాపిద్దాం’ అనే నినాదం ఇచ్చారు. ఈ నినాదం ప్రజలను తిరుగుబాటు వైపునకు నడిపించింది.
ముండా తెగకు చెందిన సుగుణ, కార్మిహాలు దంపతులకు 1875 నవంబరు 15న ఛోటానాగపూర్ సమీప చెల్కడ ప్రాంతంలోని బాబా గ్రామంలో బిర్సా ముండా జన్మించారు. ప్రాథమిక విద్యను కొద్దికాలం అభ్యసించిన తర్వాత ఒక జర్మన్ మిషనరీ స్కూల్లో చేరాడు. ఆ పాఠశాలలో చేరాలంటే క్రైస్తవుడై ఉండాలన్న నిబంధన ఉండడం వలన ఆయన మత మార్పిడి చేసుకున్నాడు. అయితే కొన్నాళ్లలోనే స్కూల్ నుండి బయటకి వచ్చి క్రైస్తవాన్ని త్యజించి తన సొంత ఆదివాసీ ఆచారాలనే ఆచరించడం ప్రారంభించారు. వనవాసీలందరినీ తమ స్థానిక విశ్వాసాలనే అనుసరించమని బోధించారు. ఆయన బోధనలు వనవాసీ సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
బ్రిటీష్ పాలకుల దోపిడీకి గురవుతున్న వనవాసీలను ఆ దోపిడీ నుంచి రక్షించడానికి, వారి భూమిని కోల్పోకుండా నిరోధించడానికి బిర్సా ముండా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఆయన ముండా తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. ఈ తిరుగుబాటునే ఉల్గులన్ అని పిలుస్తారు. ఇది 19వ శతాబ్దం చివరిలో ప్రారంభమైంది. బిర్సా ముండా చోటా నాగ్‌పూర్, బెంగాల్, ఒడిశా అడవుల్లోని వివిధ వనవాసీ తెగల ప్రజలను ఏకం చేశారు. ఆయన బిర్సైట్ అనే కొత్త మత విశ్వాసాన్ని సృష్టించి సామాజిక న్యాయం, మతపరమైన విషయాలను, సాంప్రదాయ ముండా విశ్వాసాలను మిళితం చేశారు. బిర్సా ముండా పోరాట ఫలితంగానే 1908లో బ్రిటిష్ ప్రభుత్వం ఆదివాసీల భూములను ఆదివాసీలు కానివారికి బదిలీ చేయడాన్ని నిషేధిస్తూ ది ఛోటా నాగ్‌పూర్ టెనెన్సీ యాక్ట్‌ను తీసుకువచ్చింది. అనంతర కాలంలో బిర్సా స్ఫూర్తితోనే ముండా, ఒరియన్, సంతాల్ తెగలు తమ హక్కులను సాధించుకున్నాయి.
బిర్సా ముండాను అతని అనుచరులు భగవాన్ లేదా బిర్సా భగవాన్ అని పిలిచేవారు. ఎందుకంటే తమను బ్రిటీష్ పాలకులు, వ్యాపారుల దోపిడీ, పీడన, ఇబ్బందుల నుంచి రక్షించడానికి, బ్రిటిష్ చెర నుంచి తమను విడిపించడానికి వచ్చిన దేవుడు అని వనవాసీలు నమ్ముతారు. బిర్సా ముండాను బ్రిటిషర్లు 1895 ఆగస్టులో అరెస్టు చేసి రెండేళ్లకు పైగా జైలులో పెట్టారు. ఆ తర్వాత 1900 ఫిబ్రవరి 3న మరోసారి బంధించి రాంచీ జైలుకు తరలించారు. జైలులో ఆయన్ను అనేక రకాలుగా చిత్ర హింసలు పెట్టి చివరకు విష ప్రయోగం చేశారు. ఆయన జైలులోనే 1900 జూన్ 9న జైలులోనే తుదిశ్వాస విడిచారు. కేవలం 22 ఏళ్ల వయసులోనే బ్రిటిషర్లపై యుద్ధం ప్రకటించి భారత స్వాత్రంత్యోద్యమ చరిత్రలో బిర్సా మండా ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిచారు. ఆయన గౌరవార్థం భారత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాలులో బిర్సా ముండా చిత్రపటాన్ని భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.





