News

దేవాదాయ శాఖ చట్టంలో త్వరలోనే మార్పులు : మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి

189views

దేవాదాయ శాఖ చట్టంలో త్వరలోనే మార్పులు వస్తాయని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పష్టం చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బోగోలు మండలం కొండబిట్రగుంటలో రూ.5.38కోట్లతో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టారు. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే కృష్ణారెడ్డి శంకుస్థాపన చేశారు. స్వామివారిని దర్శించి, ప్రత్యేక‌ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి.

రాష్ట్రంలోని కొండబిట్రగుంట దేవస్థానాన్ని రెండో తిరుమల క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. దాతల సహకారంతో ఇప్పటికే రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని చెప్పుకొచ్చారు. కావలి నియోజకవర్గంలో దేవస్థానాల అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడించారు. ధూప, దీప, నైవేద్యాల కోసం 73 దేవస్థానాలకి నెలకి రూ.10వేల చొప్పున సహాయం అందజేస్తున్నామని స్పష్టం చేశారు. దాతలు దేవస్థానాలు నిర్మించేటప్పుడు దేవాదాయ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆదేశించారు.