
భగవద్గీత జ్ఞానామృతమని, భారత నాగరికత చరిత్రకు సూక్ష్మ రూపమని ప్రముఖ చైనా పండితులు పేర్కొన్నారు. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆధ్యాత్మిక, భౌతిక సందిగ్ధతలకు ఈ గ్రంథం సమాధానమని వ్యాఖ్యానించారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయంలో ‘సంగమం- భారతీయ తాత్విక సంప్రదాయాల సమ్మేళనం’ అనే అంశంపై జరిగిన చర్చలో చైనా పండితులు ప్రసంగించారు. కార్యక్రమంలో ప్రధాన వక్తగా 88 ఏళ్ల ప్రొఫెసర్ ఝాంగ్ బయోషెంగ్ వ్యవహరించారు. భగవద్గీతను ఆయన చైనీస్‌లోకి అనువదించారు. గీతను ఒక ఆధ్యాత్మిక ఇతిహాసం, భారతదేశ తాత్విక ఎన్‌సైక్లోపీడియాగా అభివర్ణించారు. భారతదేశ ఆధ్యాత్మిక దృక్పథాన్ని భగవద్గీత వెల్లడిస్తుందని, దాని ఆలోచనలు నేటికీ భారతదేశాన్ని నడిపిస్తున్నాయని పేర్కొన్నారు.
1984-86 మధ్య కన్యాకుమారి నుంచి గోరఖ్‌పుర్ వరకు భారతదేశంలో తన అనుభవాలను వివరిస్తూ.. ప్రతిచోటా శ్రీకృష్ణుని ఉనికిని గ్రహించానని ఝాంగ్ తెలిపారు. చైనాతో సహా మిగిలిన ప్రపంచంతో ఒక ప్రత్యేకమైన అనుబంధాన్ని భగవద్గీత ఏర్పరుచుకుందని, దీని ఫలితంగా అన్ని ప్రధాన భాషల్లో దాని అనువాదం జరిగిందన్నారు. జెజియాంగ్ విశ్వవిద్యాలయంలోని ‘సెంటర్ ఫర్ ఓరియంటల్ ఫిలాసఫీ రీసెర్చ్’ డైరెక్టర్ ప్రొఫెసర్ వాంగ్ ఝీ-చెంగ్ మాట్లాడుతూ.. 5,000 ఏళ్ల క్రితం పురాతన భారతీయ యుద్ధభూమి నుంచి వచ్చిన భగవద్గీత నేడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు సమాధానమివ్వడానికి కాలాన్ని అధిగమించిందన్నారు.





