
దీపావళి వేడుకల కోసం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో దీపోత్సవ్ పై స్పందించిన ఆయన… క్రిస్మస్ సమయంలో విదేశాల్లో నగరాలు నెలల తరబడి విద్యుద్దీపాల వెలుగులు విరజిమ్ముతుంటాయని, వారిని చూసి నేర్చుకోవాలంటూ విమర్శించారు. ‘‘దీపాలు, కొవ్వొత్తులపై పదేపదే ఎందుకు ఖర్చు చేస్తున్నారు? అలాంటి ప్రభుత్వాలను తొలగించాలి. మేం అధికారంలోకి వేస్తే ఎంతో అందంగా లైట్లతో అలంకరిస్తాం’’ అని వ్యాఖ్యానించారు.
దీనిపై ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ప్రసాద్ మౌర్య తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ఓటుబ్యాంకు రాజకీయాల కోసం పదేపదే హిందూ విశ్వాసాలను కించపరచవద్దని అఖిలేశ్‌ను కోరుతున్నాను. భారత్‌లో దీపాలను వెలిగించడం అన్నది వందల ఏళ్లనాటి సంప్రదాయం. దీపాలను అమ్మే ప్రజాపతి సమాజం ఉపాధిని లాక్కునే చర్యకు అఖిలేశ్ దిగారు. దీపాలపై వ్యాఖ్యలను వెంటనే వెనక్కు తీసుకోవాలి. హిందువులకు క్షమాపణ తెలపాలి’’ అని కేశవ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. సనాతన వ్యతిరేకి అంటూ అఖిలేశ్‌ను యూపీ భాజపా చీఫ్ భూపేంద్ర సింగ్ విమర్శించారు.





