
ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ 3న తీర్పునిచ్చింది. ఈ విషయంపై పలు రాష్ట్రాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీపావళి కోసం పిల్లలు ఎదురుచూస్తారని.. పర్యావరణహితమైన బాణసంచాతో వారిని పండగ చేసుకోవడానికి అనుమతించాలని న్యాయస్థానాన్ని కోరాయి. దీపావళి రోజున రాత్రి 8 నుంచి 10 వరకు రెండు గంటలపాటు పర్యావరణహితమైన బాణసంచా కాల్చడానికి అనుమతివ్వాలని ఎన్సీఆర్ రాష్ట్రాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ కే వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనాన్ని కోరారు.
కొన్ని షరతుల కింద రాష్ట్రాల్లో బాణసంచా వాడకాన్ని అనుమతించవచ్చని, జాతీయ పర్యావరణ ఇంజినీరింగ్ పరిశోధన సంస్థ -NEERI ఆమోదించిన పర్యావరణహిత బాణసంచా మాత్రమే తయారు చేసి, విక్రయించేలా సూచించాలని తుషార్ మెహతా పేర్కొన్నారు. అత్యధిక పేలుడు స్వభావమున్న టపాసులు తయారు చేయకుండా రాష్ట్రాలు, దిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటాయని ధర్మాసనానికి తెలియజేశారు. అదే విధంగా వ్యాపారులు అనుమతి పొందిన క్రాకర్లను మాత్రమే విక్రయించాలని.. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ మొదలైన ఏ ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్లు కూడా బాణసంచాను ఆన్‌లైన్‌లో విక్రయించవద్దని సూచించారు. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.





