ArticlesNews

అంతర్వేది ధామం.. ఆధ్యాత్మిక హారం

269views

నవ నారసింహ క్షేత్రాల్లో ఒకటిగా పేరొందిన అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి ఆదాయం పెంచేలా దేవాదాయ శాఖ బృహత్తర ప్రణాళికను రూపొందిస్తోంది. ఆలయం సమీప ప్రాంతాలు సముద్రం, గోదావరి, ఫిషింగ్‌ హార్బర్, వివిధ రకాల జలపుష్పాలు, పచ్చటి చెట్లతో కళకళలాడుతూ ఆధ్యాత్మికతతోపాటు పర్యాటకానికి అనుకూలంగా ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం తర్వాత ఆయా ప్రాంతాలను సందర్శించేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు.

ఆదాయం పెంచేందుకు..
స్వామివారికి సుమారు 900 ఎకరాలు ఉండగా వాటిపై లీజులు, హుండీ ఆదాయం, టిక్కెట్ల ద్వారా రూ.6 కోట్లు వస్తోంది. ఇవి సీజీఎఫ్, జీతాలు, ధూపదీప నైవేద్యాలకు సరిపోతున్నట్లు ఏసీ చెబుతున్నారు. ఆలయానికి విరాళాలు ఇచ్చే దాతలకు గుర్తింపు కార్డులిచ్చి వారు దర్శనానికి వచ్చినప్పుడు ఉచితంగా పూజలు చేయించి, వసతి కల్పిస్తారు. నిత్య ధూపదీప నైవేద్యాలు, పూజాది కార్యక్రమాలకు రుసుము పెంచడం, శని, ఆదివారాలతోపాటు పర్వదినాల్లో ఉచితంగా బస్సులు నడిపించడం వల్ల ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

కార్యాచరణ ఇలా..

  • ఆలయ పరిసర ప్రాంతంలోని 34 ఎకరాలను డ్రోన్‌తో సర్వే చేసి ఫొటోలు తీయించారు.
  • 400 మంది భక్తులు ఒకేసారి అన్నప్రసాదం స్వీకరించేలా దాతల సహకారంతో ఇప్పటికే అన్నదాన సత్రం నిర్మిస్తున్నారు.
  • ఆలయానికి ఈశాన్యంలో సుమారు 5 ఎకరాల్లో కోనేరు తవ్వించి, వచ్చిన మట్టితో తూర్పుభాగంలో సుమారు 10 ఎకరాల భూమిని పూడ్చాలనే ఆలోచన చేస్తున్నారు.
  • భక్తులు ఉండడానికి 50 వసతి గదులు, మరుగుదొడ్లు, కల్యాణ మండపం నిర్మాణం, తాగునీటి సౌకర్యం, బస్సులు, కార్లు నిలిపేందుకు సదుపాయాలు కల్పించడానికి ఎమ్మెల్యే చర్చిస్తున్నట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషన్‌ నాగవరప్రసాద్‌ తెలిపారు.