
నంద్యాల జిల్లా, కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ సెప్టెంబర్ 12, 2025వ తేదీన నంద్యాలలోని శ్రీ రామకృష్ణ కళాశాల ప్రాంగణ మందలి శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఆపరేషన్ సిందూర్ లో అమరుడైన అగ్ని వీర్ ముదావత్ మురళీ నాయక్ కు స్మృత్యంజలి సభను నిర్వహించారు.
ప్రధాన వక్త డాక్టర్ ఉదయ్ శంకర్ మాట్లాడుతూ భారత సైన్యం గొప్పతనం, వివిధ యుద్ధాల్లో జరిగిన ఘట్టాల గురించి కళ్లకు కట్టినట్లు వివరించారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లో మన త్రివిధ దళాల సమన్వయ పోరాటం, ఇస్రో శాస్త్రవేత్తల సాంకేతికత, భారతీయ తయారీ ఆయుధ పాఠవం ప్రపంచ సైనిక విశ్లేషకులకే విస్మయం కొలిపిందని తెలిపారు.
అనాది నుండి భారతీయులు త్యాగ మూర్తులైనందువల్లే విదేశీయుల వెయ్యి సంవత్సరాల దాడుల తర్వాత కూడా భారతదేశం నిలదొక్కుకుని అగ్ర పథం వైపు దూసుకు పోతున్నదని తెలిపారు. విద్యార్థులు దేశంలో, ప్రపంచంలో జరుగుతున్న వివిధ ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిష్థితుల గురించి ఎప్పటి కప్పుడు తెలుసుకుంటూ, నలుగురికి తెలియ జేస్తూ జాగరూకులై ఉండి మన చుట్టుపక్కల విదేశీ కుట్రలకు బలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి పరిస్థితి మన దేశంలో రాకుండా కాపాడుకోవలసిన అవసరాన్ని వివరించారు. సరిహద్దుల్లో మన సైనికులు విదేశీ దాడులను తిప్పి కొడితే, మనం సమాజంలో మన చుట్టూ ఉన్న స్వార్థ పరుల, విదేశీ కుట్ర దారుల కుతంత్రాలను తిప్పి కొట్టి యువతలో దేశభక్తి, ధర్మనిష్ట, ఐక్యత, సమరసత కొరకు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

విభాగ్ ప్రౌడ ప్రముఖ్ శ్రీ రాంప్రసాద్ గత నాలుగు సంవత్సరాలుగా సైనికుల కోసం చేస్తున్న సేవలను వివరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ రామకృష్ణా కళాశాలల అధినేత డాక్టర్ రామకృష్ణారెడ్డి, సక్షమ్ అధ్యక్షులు డాక్టర్ నేట్ల మహేశ్వర రెడ్డి, డాక్టర్ వసుధ, డాక్టర్ నర్మద, డా విజయ్ బాబు, డా హరినాధ రెడ్డి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి , సైనిక కుటుంబాలు, కాలేజీ విద్యార్థులు దాదాపు వేయి మంది పాల్గొన్నారు.
ఈ సమావేశంలో ఆ వీరుడికి జన్మనిచ్చిన తల్లి దండ్రులను కేర్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ మరియు నంద్యాల విశ్వహిందూ పరిషత్ తరుఫున ఘనంగా సన్మానించి ఇతోధికంగా ఆర్థిక సహకారం అందజేశారు.
మురళి నాయక్ తల్లిదండ్రులు మాట్లాడుతూ, మా బిడ్డ త్యాగాన్ని గుర్తించి, మమ్ము ఇంత దూరం పిలిపించి మా కుమారుడి గురించి ఇంత గొప్పగా తెలిపిందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.





