ArticlesNews

ఆదిదంపతులు

186views

సనాతన ధర్మం ఆధ్యాత్మికతతో పాటు ఆధునిక యుగంలో ఉపయుక్తమైన ఎన్నో అంశాలను బోధించింది. వేదపురాణేతిహాసాలు మానవజాతికి లభించిన వరాలు. వాటి సారాన్ని సామాన్య మానవుడికి అర్థమయ్యే రీతిలో వివిధ గ్రంథాల్లో నిక్షిప్తం చేశారు అనేకమంది గురువులు. వారిలో శంకరాచార్యులు అగ్రగణ్యులు. ఆయన రచించిన సౌందర్యలహరిలో ఇరవై మూడో శ్లోకం అర్ధనారీశ్వర తత్వాన్ని ఎంతో అందంగా వివరిస్తుంది.

గౌరీశంకరులు ఆదిదంపతులు. అర్ధనారీశ్వరత్వంతో మానవాళికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆలుమగల అనుబంధంలోని పవిత్రతకు ప్రతిరూపాలుగా వారు పూజలందుకుంటున్నారు. శంకరాచార్యులు ఆ శ్లోకం ప్రథమార్ధంలో శివపార్వతుల అనురాగాన్ని, ద్వితీయార్ధంలో వారి ఐక్యతను అభివర్ణించారు. ‘అమ్మా! శివుడు తన దక్షిణ భాగంలో నిన్ను చేర్చుకుని అర్ధనారీశ్వరుడయ్యాడు. కానీ అంతటితో తృప్తి చెందక ఆయన శరీరంలో మిగతా సగాన్ని కూడా నువ్వే తీసేసుకుని శివుడికి, శక్తికి భేదం లేదని చెబుతున్నట్లు అనిపిస్తోంది’… అంటుంది మొదటిభాగం. ఇందులో భార్యకు తనలో సగాన్ని ఇచ్చేసిన శివుడి ప్రేమ కనపడుతుంది. పరమేశ్వరుడిలో ఐక్యమైపోయే శక్తి స్వరూపం దర్శనమిస్తుంది. అది ఎలాగో శంకరాచార్యులు శ్లోకం రెండో భాగంలో ఇలా చెబుతారు… ‘ఒంటినిండా విబూదితో తెల్లగా కనపడే శివుడు, నువ్వు ఆయనలో కలిసిపోవడం వల్ల అరుణ వర్ణంలో కనపడుతున్నాడు. తలపై బాలచంద్రుణ్ని మకుటంగా ధరించినప్పటికీ, వక్షస్థల భాగం కొద్దిగా వంగి స్త్రీ స్వరూపంలోనే దర్శనమిస్తున్నాడు’!

శివుడు లయకారుడు, శ్మశానవాసి, నిరాడంబరుడు, నిర్వికారుడు. శక్తి సౌభాగ్యరూపిణి, నిత్యాలంకారిణి, మహాచండీ, మంగళస్వరూపిణి. ఇద్దరివీ పూర్తిగా భిన్న స్వరూపాలు. ధ్యానమూర్తయిన శివుడి నిశ్చలత్వానికి ఆవిడే చైతన్యం. వారి కలయిక సృష్టికి మూలం. స్త్రీ పురుషుల మధ్య భిన్నత్వాన్ని దాటి ఆలోచించినప్పుడే ఐక్యత సాధ్యం. భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, ప్రేమ అవసరం. బోళా శంకరుడు భక్తులకిచ్చిన వరాల వల్ల ఎన్ని కష్టాలెదురైనా సతి ఆయనను నిందించలేదు. భక్తుల కోరికలు తీర్చడం భగవంతుడి ధర్మం. కష్టనష్టాలు తాత్కాలికం. ధర్మమే శాశ్వతం. అలాగే దక్ష యజ్ఞంలో తన భార్యకు జరిగిన అవమానాన్ని శివుడు సహించలేదు. రౌద్రరూపంలో ప్రళయ తాండవం చేశాడు. భార్య ఆత్మగౌరవాన్ని కాపాడటం భర్త ధర్మం. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడే భార్యాభర్తలు పరస్పర విశ్వాసంతో ముందుకు వెళ్లాలి. నిష్కల్మషమైన ప్రేమే భక్తి. దక్ష యజ్ఞం తరవాత సతిగా జన్మ చాలించి, పార్వతిగా పునర్జన్మ పొంది పరిపూర్ణమైన భక్తితో మళ్లీ శివసాంగత్యం పొందింది.

శివపార్వతుల ప్రేమ శాశ్వతత్వానికి చిహ్నం. అందుకే వారి కల్యాణాన్ని లోకకల్యాణంగా అభివర్ణిస్తారు. వారి కథ లోకానికి సదా స్ఫూర్తిదాయకం. భౌతిక రూపాలు వేరైనా, ఒకే ఆత్మగా జీవించమని శివపార్వతుల దాంపత్యం మనకు చెబుతుంది.