
భారతదేశమే సనాతన ధర్మం, సనాతన ధర్మమే శ్రీరాముడు. అంటే భారతదేశం సాక్షాత్ శ్రీరాముడే. ఇది గుర్తెరిగి వందల సంవత్సరాల నుండి ఎందరో మహాత్ములు భారతదేశమునకు దిశా నిర్దేశనం చేసి, భారతదేశమునకు సేవలు చేసి, భారతదేశం కోసం త్యాగాలు చేసి తరించారు.అలాంటి మహాత్ముల కోవలోకి వచ్చే కర్మయోగులతో కూడిన ఒక దివ్య మానవ సమూహమే-రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్.
ఇంతకు ముందే చెప్పినట్టు భారతదేశమే శ్రీరాముడు అయితే శ్రీరాముడు వంటి భారత దేశమునకు శిక్షణ ను ఇచ్చిన ఘనత ఇద్దరు మహర్షుల కు దక్కుతుంది. శ్రీరాముడిని బ్రహ్మర్షి వశిష్ట, బ్రహ్మర్షి విశ్వామిత్రులు తీర్చి దిద్దితే, ఈ భారతదేశం అనే శ్రీరాముడిని బ్రహ్మర్షి వశిష్ట తుల్యులు శ్రీమాన్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ గారు(డాక్టర్ జీ) మరియు బ్రహ్మర్షి విశ్వామిత్ర తుల్యులు శ్రీమాన్ సదాశివ మాధవ గోల్వాల్కర్ గారు (గురూజీ) తీర్చి దిద్దారని చెప్పవచ్చు.
RSS అనే కర్మయోగులతో కూడిన ఒక దివ్య మానవ సమూహమును స్థాపించి డాక్టర్జీ, ఆయన స్థాపించిన RSS మరింతగా వ్యాపించడానికి గురూజీ చేసిన అఖండ యజ్ఞము అసామాన్యము.
శ్రీరాముడికి సేవచేయడానికే తన జీవితాన్ని అంకితం చేసి ‘లక్ష్మణో విగ్రహవాన్ సేవః’ అని కొనియాడబడిన లక్ష్మణుడి లాంటి ఎందరో సేవకులను శ్రీరాముడి వంటి భారతదేశమునకు డాక్టర్జీ, గురూజీ లు అందించారు అనడం అతిశయోక్తి కానేకాదు.
సేవ చేయడంమాత్రమే కాదు, సేవను ఒక తపస్సు, యజ్ఞం లా భావించి చెయ్యడం,సేవచేయడం మాత్రమే తన కర్తవ్యం గా అనుకోవడం, చేసిన సేవకు ప్రతిఫలం ఆశించకపోవడం,సేవచేయడమే మహత్తరమైన వరముగా భావించడం, సేవకు గుర్తింపు అస్సలు కోరుకోకపోవడం త్రేతాయుగంలో లక్ష్మణుడికి చెల్లింది, ఇప్పుడు ఆధునిక భారతదేశంలో కోట్లమంది స్వయంసేవక్ లకు చెల్లింది.
అప్పుడు లక్ష్మణుడు సేవచేసింది శ్రీరాముడికి అయితే, ఇప్పుడు స్వయంసేవక్ లు సేవచేస్తుంది శ్రీరాముడి స్వరూపమైన భారతదేశమునకు.
ఇలాంటి కలియుగ లక్ష్మణులు ఎన్నో లక్షలమంది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ఉన్నారు.
ఇక భరతుడి గురించి చూద్దాం. తనకు రాజ్యం ఏలే అవకాశం తన ప్రమేయం లేకుండానే వచ్చినా, ఆ రాజ్యం పైన అధికారం తన అగ్రజుడు శ్రీరాముడికి మాత్రమే ఉందని త్రికరణ శుద్ధిగా నమ్మి, తనకు ప్రాప్తించిన రాజ్యాన్ని తృణ ప్రాయం గా త్యాగంచేసి, శ్రీరాముడి ఆజ్ఞతో శ్రీరామపాదుకలను సింహాసనం పై పెట్టి, ఆ పాదుకలకు ప్రతినిధిగా మాత్రమే నిస్వార్ధంగా రాజ్యం బాగోగులు చూసాడు.ఇప్పుడు అలాంటి భరతులు సంఘ్ లో ఎంతోమంది ఉన్నారు.పదవికన్నా దేశం కోసం సేవ చేయడమే పరమావధిగా భావించి తరిస్తున్నవారు ఎందరో సంఘ్ లో ఉన్నారు.
ఇక శత్రుఘ్నుడు విషయానికి వస్తే, తనకు రామ ప్రేమికుడైన భరతుడికి వెన్నంటి ఉండి తన బాగోగులు చూసుకోవడమే తన కర్తవ్యం గా భావించి జీవించాడు. ఆతడు శ్రీరాముడికి పరోక్ష సేవ చేసినట్టే భావించాలి. ఇంకా యధార్ధంగా చెప్పాలంటే శ్రీరాముడికి ప్రత్యక్ష సేవ చెయ్యడం కంటే శ్రీరామ భక్తులకు ప్రత్యక్ష సేవ చెయ్యడం చాలా గొప్ప అని మహాత్ములు బోధ చేశారు. ఆలా ఇప్పుడు సంఘ్ లో ఎందరో లక్ష్మణులకు, భరతులకు సేవచేస్తూ జీవితాంతం తమ ఆస్థిత్వాన్ని ప్రపంచానికి మరుగుపరచి తరించిన ఎందరో శత్రుఘ్నులు సంఘ్ లో ఉన్నారు. వారందరూ ధన్యులు.ఒక్కమాటలో చెప్పాలంటే భారతదేశానికి సేవచేస్తున్న ఎందరో స్వయంసేవక్ లకు తమకు తోచినంతలో సహాయం చేస్తున్నవారు అందరూ శత్రుఘ్నులే.
ఇక హనుమంతుడి సంగతికి వద్దాం. ఎల్లప్పుడూ శ్రీరాముడికోసం, శ్రీరాముడిని నమ్ముకున్న వాళ్ళ కోసం మాత్రమే త్రికరణశుద్దిగా పనిచేయడం హనుమాన్ కి మాత్రమే చెల్లింది. ఆయన త్యాగానికి ప్రతిరూపం, అలాంటి త్యాగధనులు సంఘ్ లో కూడా ఉన్నారు. ఎప్పుడూ శ్రీరామ స్వరూపమైన భారతదేశ అభివృద్ధికి, భారతదేశ పౌరులసేవ చేయడం మాత్రమే తమ జీవిత లక్ష్యం గా పెట్టుకుని తరిస్తున్న వారు ఎందరో సంఘ్ లో ఉన్నారు.వారు తమ శక్తిని, యుక్తిని, భక్తిని ఎప్పుడూ తమ కోసమో, తమ గొప్ప అని ప్రపంచం గుర్తించడం కోసమో ఎప్పుడూ తాపత్రయపడరు.ఎంత మంచి చేసినా వినయంతో తమకు ఏమీ తెలియదు, తాము నిమిత్తమాత్రులము అన్నట్టే ఉంటారు. వీరు అందరూ హనుమాన్ లాంటి వారు.
ఇక సమస్త వానరసేన సంగతికి వస్తే, తాము ఎంత చపలచిత్తులైనా శ్రీరాముడి సంగతికి వచ్చేసరికి పద్దతిగా పని చేసే స్వభావం ఉన్నట్టే, ఎందరో సంఘ కార్యకర్తలు భారతదేశసేవ భారతీయులసేవ సంగతిలో మాత్రం ఎప్పుడూ ముందుంటారు.
ఇక సీతామాత విషయం కి వద్దాము. భారతదేశం శ్రీరాముడైతే సీతామాత ప్రతిరూపం ఏమిటి? సమస్త భారతదేశ ప్రకృతి, పర్యావరణం, సంస్కృతి,మందిరాలు, క్షేత్రాలు, సంప్రదాయం, పండుగలు మొదలైనవి అన్నీ సీతామాత స్వరూపాలే. రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీతామాత స్వరూపాలైన వీటినన్నిటినీ కూడా ఎంతో శ్రద్దగా తమ ఇతర విభాగాల ద్వారా సేవిస్తున్నారు.
చివరగా ఒక్క మాట,రాస్ట్రీయ స్వయంసేవక్ సంఘ్- ఆధునిక భారతదేశం కోసం ఆవిర్భవించిన కర్మయోగులతో నిండిన ఒకానొక దివ్యమానవసేవాసాగరము.
– సత్యకాశీ భార్గవ & భారవి కొడవంటి





