News

భేదభావాలు లేకుండా అందరికీ స్వయంసేవకుల సాయం :మోహన్ భాగవత్

119views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని ఢిల్లీలోని భవన్‌లో మూడు రోజులుగా సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ద్వారా వ్యాఖ్యానమాల ప్రసంగాలు జరుగుతూ వచ్చాయి. ఇందులో భాగంగా చివరి రోజున (గురువారం) మోహన్ భాగవత్ గారు ఈ వ్యాఖ్యానమాలకి హాజరైన వ్యక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. వాటిలోని కీలకమైన అంశాలివి…

కులాధారిత రిజర్వేషన్లు అత్యంత సున్నితమైన అంశం. దీనికి దీనదయాళ్ గారు ఒక దృష్టికోణం ఇచ్చారు. ఎవరు అట్టడుగున ఉంటారో వారు చేతులెత్తి పైకి రావడానికి ప్రయత్నించాలి. అప్పటికే పైనున్నవారు, వారిని పైకి తీసుకురావాలి. రాజ్యంగబద్ధమైన రిజర్వేషన్లకు సంఘ్ మద్దతిస్తుంది.

హిందూ ధర్మంలో అంటరానితనానికి అంగీకారం లేదని 1969లో జరిగిన ఉడుపి సమ్మేళనంలో హిందూ ధర్మాచార్యులు ప్రకటించారు.

హిందవః సోదరాః సర్వే న హిందూ పతితో భవేత్|
మమ దీక్షా హిందూః రక్షా మమ మంత్రః సమానతా|

ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ గారు జన్మతః దేశభక్తులు. వారితో పాటు అనేకమంది పదాధికారులు స్వాతంత్య్రోద్యమంలో భాగమయ్యారు. డాక్టర్ హెడ్గేవార్ గారి జీవితం, భారత స్వాతంత్య్రోద్యమంలో ఆర్ఎస్ఎస్ పాత్ర గురించి తెలుసుకోవడానికి పబ్లికేషన్స్ డివిజన్ ప్రచురించిన డాక్టర్ కేశవ్ బలీరాం హెడ్గేవార్ పుస్తకం చదవాలి. భారతదేశ విభజనను ఆపడంలో సంఘ్ పాత్రను అర్థం చేసుకోవాలంటే, హెచ్‌వి శేషాద్రి గారు రాసిన “ట్రాజిక్ స్టోరీ ఆఫ్ పార్టిషన్” పుస్తకం చదవాలి.

భారత్‌లోని భాషలన్నీ జాతీయ భాషలే.. వీటి మధ్య వ్యవహారానికి, అనుసంధానానికి భారతీయ భాషే ఉండాలి. అది విదేశీ భాష కారాదు. భాషాపరమైన వివాదాన్ని సృష్టించరాదు.

నగరాలకు, రహదారులకు ఆక్రమణదారుల పేర్లు పెట్టకూడదు. ముస్లింల పేర్లు ఉండకూడదని నేను చెప్పలేదు. వాటికి వీర్ అబ్దుల్ హమీద్, అబ్దుల్ కలాం లాంటివారి పేర్లు పెట్టాలి. ఆక్రమణదారుల పేర్లు ఉండకూడదు.

సంఘ్ స్వయంసేవకులు ముస్లింలపై దాడులు చేసినట్లు సాక్ష్యాలు లేవు. కేరళ వరదలప్పుడు, గుజరాత్ భూకంప సమయంలో ఎలాంటి భేదభావాలు లేకుండా అందరికీ స్వయంసేవకులు సాయం చేశారు. సంఘ్ స్వయంసేవకులు సేవ చేసేటప్పుడు బాధిత ప్రజలు ఏ మతానికి చెందినవారనేది చూడనే చూడరు. మాకు రాంప్రసాద్ బిస్మిల్ నుంచి ఎంతటి ప్రేరణ లభించిందో, అష్ఫాకుల్లా ఖాన్ నుంచి కూడా అంతటి ప్రేరణ లభించింది.

సాంకేతికత, విద్య అనేవి ఒకదానితో ఒకటి వ్యతిరేకం కాదు. సాంకేతికత ,ఆధునికత విద్యకు మేం వ్యతిరేకం కాదు. ఎందుకంటే సాంకేతికత కాలంతో పాటు మారుతుంది. అది విద్యలో కలిసిపోతుంది. సాంకేతికతను సముచితంగా ఉపయోగించడం అనేది మనిషి చేతుల్లోనే వుంది. వాటి దుష్పరిణామాల నుంచి కాపాడుకోవడం, వాటి నుంచి ప్రజలను రక్షించడం ముఖ్యం. మనిషి సాంకేతికతకు యజమానిగా వుండాలే తప్పించి, సాంకేతికత మనిషికి యజమానిగా మారకూడదు. సాంకేతికత కంటే మానవ మేధస్సుకు ప్రాధాన్యత కల్పించాలి.

విద్య కేవలం సమాచారం కాదు, మనిషిని సంస్కారవంతుడిని చేయాలి. విద్య అంటే సమాచారాన్ని నింపడం కాదు. మానవ మేధస్సు సాంకేతికతను వివేకవంతంగా ఉపయోగించుకోవాలి. మన సంప్రదాయం, సంస్కృతి ఆధారంగా విద్యా విలువలను బోధించాలి. జాతీయ విద్యా విధానంలో పంచకోషీయ విద్యకు ప్రాధాన్యం ఉంది.

మన భారతీయ విద్య, జ్ఞానపరంపర తెలుసుకోవాలంటే సంస్కృత భాషా పరిజ్ఞానం కచ్చితంగా వుండాలి. అయితే సంస్కృత భాషను అనివార్యం చేయవద్దు కానీ.. భారత్‌ను సరిగా అర్థం చేసుకోవాలంటే సంస్కృత భాష ఉపయోగపడుతుంది. పిల్లలు గర్వంగా భావించేలా వారికి గతం గురించి సమాచారం అందించాలి. మన సంప్రదాయాలు, విలువలు , సంస్కృతి గురించి విద్యను ప్రతిచోటా బోధించాలి. ఇది మతపరమైనది కాదు, సాంస్కృతికమైనది. ప్రతిచోటా మన సంప్రదాయాలు, విలువలు, సంస్కృతిని గురించి తెలియజేసేలా విద్యా బోధన జరగాలి. ఇది సాంస్కృతికమైనది, మతపరమైనది కాదు.

విద్యలో సంస్కారం. మన విద్యా వ్యవస్థలో వలసవాద భావజాలం ఇంకా ఉందని మీరు అనుకుంటున్నారా? మన విద్యార్థులు వామపక్షభావజాల రచయితలు రాసిన పుస్తకాలు చదువుతున్నారు. భారతీయ గురుకుల విద్య పట్ల జరుగుతున్నదేమిటి? ఇంకా, సంస్కృతాన్ని తప్పనిసరి చేయడంపై ఒక ఆలోచన చెయ్యాలి.

రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, ఆదేశ సూత్రాలు – పాఠశాల విద్యార్థులు ఈ నాలుగు అంశాలనూ తెలుసుకుని ఉండాలి.

మనం ఇంగ్లీషు వారిలా మారాలని కోరుకోవడం లేదు, కానీ ఇంగ్లీషు నేర్చుకోవడంలో ఎటువంటి సమస్య లేదు. ఒక భాషగా, దీనికి ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. మన దేశంలోని పురాతన విద్యా వ్యవస్థను రద్దు చేసి, వారు (విదేశీయులు) పాలించగలిగేలా కొత్త విద్యా వ్యవస్థను ప్రారంభించారు.

ఫిన్లాండ్‌లో విద్యా వ్యవస్థ మన గురుకులం తరహాలో ఉంటుంది. 8వ తరగతి వరకూ మాతృభాషలోనే బోధిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల ప్రజలు అక్కడ చదుకునేందుకు వస్తుంటారు.