
అమ్మ చేతి పసుపు బొమ్మగా ప్రాణం పోసుకున్నాడు వినాయకుడు. అందుకే భక్తులు తనను ఏ రూపంలో కొలిచినా.. ఆ విఘ్నేశ్వరుడు పరవశించిపోతాడు. వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా గణపయ్య మండపాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. మట్టి విగ్రహాలతో పాటు పండ్లు, ఫలాలు.. ఇలా అనేక రూపాల్లో బొజ్జ గణపతి కొలువుదీరాడు. అయితే ఒడిశాకు చెందిన ఓ మహిళ ఆవు పేడతో వినాయకుడి విగ్రహాలను తయారుచేస్తున్నారు. సనాతన సంప్రదాయాన్నే తన వ్యాపారంగా మలుచుకొని పర్యావరణంపై ప్రేమను చాటుకున్నారు.
భువనేశ్వర్‌లో నివాసం ఉంటున్న సారిక కొవిడ్ సమయంలో ఉపాధి కోల్పోయారు. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలన్న ఆలోచనతో ఆవు పేడతో ప్రయోగాలు చేశారు. హిందూ సంప్రదాయంలో దీన్ని స్వచ్ఛత, శుద్ధికి సూచికగా చూస్తాం. పాత కాలంలో పూజల సమయంలో ఆవుపేడతో ఇళ్లు అలికి ముగ్గులు పెట్టేవారు. ఆ ఆలోచనతోనే ఆవు పేడతో వినాయక విగ్రహాలు చేయడం మొదలుపెట్టారు. పేడను ఎండబెట్టి దాన్ని పొడిచేసి.. అందులో బంకమట్టి, రంపపుపొట్టు, పిండి కలిపి గణపయ్యను తీర్చిదిద్దారు.
ఆమె చేసే విగ్రహాలు ప్రత్యేకంగా ఉండటంతో తక్కువ కాలంలోనే మంచి ఆదరణ లభించింది. గిరాకీ పెరగడంతో ‘గో ధామ్’ బ్రాండ్‌తో విక్రయాలు ప్రారంభించారు. వినాయకుడి విగ్రహాలతో పాటు ప్రమిదలు, ఇతర డెకరేటివ్ వస్తువులను కూడా ఆవు పేడతో తయారుచేసి అమ్ముతున్నారు. వీటి ధర రూ.50 నుంచి రూ.5వేల వరకు ఉంటుందని సారిక తెలిపారు. ఆమె తయారుచేసే విగ్రహాల్లో 80శాతం పేడ, 20శాతం మట్టి వంటి ఇతర పదార్థాలను వినియోగిస్తున్నారు.
‘‘సనాతన ధర్మంలో ఆవును గోమాతగా వర్ణిస్తాం. తల్లిలా కొలుస్తాం. ఆవు పేడలోనూ ప్రకృతితో ముడిపడిన అంశాలున్నాయి. ఇందులో ఎలాంటి రసాయనాలు ఉండవు కాబట్టి.. ఈ విగ్రహాలను నిమజ్జనం చేసినా పర్యావరణానికి ఏ హాని ఉండదు’’ అని సారిక చెబుతున్నారు. ఆన్‌లైన్‌తో పాటు ఎగ్జిబిషన్లు పెట్టి ఆమె తన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
ఈమే కాదు.. ఉత్తరాఖండ్‌లోని ఓ ఎన్జీవో, మహారాష్ట్రలోని ఓ స్వయం సహాయక బృందం కూడా ఆవు పేడతో విగ్రహాలు చేస్తూ పర్యావరణాన్ని కాపాడదామని పిలుపునిస్తున్నారు.





