
వసుధైక కుటుంబమే భారత్ సిద్ధాంతమని ఎన్ని ఒడుదొడుకులొచ్చినా రక్షణ చర్యల్లో ఎప్పటికీ రాజీ పడబోమని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ పేర్కొన్నారు. మంగళవారం తూర్పు నౌకాదళ ముఖ్యకేంద్రం విశాఖపట్నం నేవల్ డాక్‌యార్డులో జరిగిన ‘ఐఎన్‌ఎస్ ఉదయగిరి, ఐఎన్‌ఎస్ హిమగిరి’ నౌకలను జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఏకకాలంలో రెండు భారీ యుద్ధనౌకలను నేవీ సేవలకు అందించడం సంతోషకరమన్నారు. స్వీయరక్షణ పరిజ్ఞానాన్ని ఒడిసిపట్టుకుంటూ రానున్న రోజుల్లో భారత్ నౌకాదళం సముద్ర శక్తిగా మారబోతోందన్నారు. సూర్యోదయ, హిమ శిఖరాల పేర్లమీద ఈ రెండు నౌకలకు ఉదయగిరి, హిమగిరిగా నామకరణం జరిగిందన్నారు. ఇండో-పసిఫిక్, హిందు మహాసముద్ర ప్రాంత రక్షణ బలోపేత చర్యల్లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ జలాల్లో ఈ నౌకలు కూడా బహుముఖ పాత్రను పోషిస్తాయన్నారు. దేశీయ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ రెండు నౌకల అనుభవంతో 2050 నాటికి భారత్ 200 యుద్ధనౌకల నిర్మాణ స్థాయికి చేరనుందన్నారు. తొలుత నావికుల గౌరవ వందనాన్ని రక్షణమంత్రి స్వీకరించారు. కార్యక్రమంలో భారత నేవీ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఈస్ట్రన్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్‌పెంథార్కర్, హిమగిరి కమాండింగ్ అధికారి రాబిన్ చక్రవర్తి ఇతర కమాండ్ అధికారులు, పూర్వ నేవీ అధికారులు, నౌకాదళ ఉద్యోగుల కుటుంబీకులు పాల్గొన్నారు.





