ArticlesNews

వ్యక్తిత్వ వికాస నిపుణుడు వినాయకుడు

158views

గణాలన్నిటిని ఏకతాటిపై నడిపించే వాడు. ప్రథమ పూజ్యుడు. సత్యప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే విశేషమైన నాయకత్వ లక్షణాలు కలవాడు. ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. గెలవాలని సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలను గుర్తిస్తే కుశాగ్ర బుద్ధితో దానిని అధిగమించవచ్చని నిరూపించాడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించ డంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది.

గజాననుడిని ప్రణవనాద స్వరూపుడిగా, శబ్దబ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం, లోకరక్షకు డిగా గణేశపురాణం, సమస్త లోకానికి ఆధారశక్తిగా గణేశగీత చెబుతున్నాయి. దేవతల నుంచి మానవుల వరకు ఎదుర్కొనే విఘ్నాలను, ప్రతికూల శక్తులను నిలువరించి, వారు చేపట్టే కార్యాలు విజయతీరాలకు చేరేందుకు ఆయన కృప ఉపకరిస్తుందని వేదవాక్కు. అందుకు ఎన్నో పురాణగాథలు ఉదాహరణలుగా ఉన్నాయి.

‘కండబలముతోనే ఘనకార్యము సాధించలేరు. బుద్ధిబలము తోడైతే విజయమ్ము వరింపగలరు’ అన్నారు ఒక కవి. శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పదని చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు వినాయకుడు. బలాన్ని, బలహీనతను ఎరిగి ప్రవర్తించాలన్నది ఆయన చర్య చాటిచెబుతోంది. గణాధిపత్యం కోసం అన్నదమ్ములు వినాయకుడు, కుమారస్వామి పోటీ పడినప్పుడు.. ‘ముల్లోకాల్లోని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ పదవి దక్కుతుంది’ అని తండ్రి పరమేష్ఠి నిబంధన విధించాడు. దానికి, స్థూల కాయుడైన గణేశుడు మొదట కలత చెందాడు. శక్తిమంతుడు, వేగంగా ప్రయాణించగల తమ్ముడిని అధిగమించలేనని భావించాడు. అంతలోనే బుద్ధిబలాన్ని ప్రయోగించాడు. కన్నవారే కనిపించే దైవాలనీ, ప్రకృతి పురుషులైన తల్లిదండ్రులకు ప్రదక్షిణతో సర్వపుణ్య నదీస్నాన ఫలితం దక్కుతుందని గ్రహించి ఆచరించాడు. తమ్ముడు వెళ్లిన చోట ప్రతి నదిలో అన్న స్నానమాడుతూ కనిపించాడు. గణాధిపతిగా నియమితుడై సర్వసమర్ధుడిగా మన్ననలు అందుకున్నాడు. శ్రీరామచంద్రుడు లంకకు సేతుబంధన సమయంలో వినాయకుడు మార్గదర్శనం చేశాడని, వారధి నిర్మాణంలో ఇంజనీర్‌లా సూచనలు చేశారని చెబుతారు. కుశాగ్రబుద్ధి కలవాడు కనుకే మహాభారత రచనలో వ్యాస భగవానుడికి రాయసకారుడిగా ప్రతిభను ప్రదర్శించాడు. తాను చెబుతున్నప్పుడు తన వేగాన్ని అందిపుచ్చుకుంటూ, తాను చెప్పేది అర్థం చేసుకున్న తర్వాతే రాయాలన్న వ్యాసుడి నిబంధనను అంగీకరించాడు.

ప్రకృతి దేవుడు
ప్రకృతిని భగవత్‌ ‌స్వరూపంగా భావించి ఆరాధించడం వినాయక వ్రత విధానంగా చెబుతారు. వినాయకుడు రూపుదాల్చింది వర్ష రుతువులోనే. ఈ కాలంలో ప్రకృతి ఆకులు, పూలతో హరితమయంగా ఉంటుంది. ముఖ్యంగా ఔషధీ గుణాలు గల 21 రకాల పత్రులతో అర్చిస్తారు. మాచీ పత్రం, బృహతీ పత్రం(ములగ), బిల్వ (మారేడు), దూర్వారయుగ్మం (గరిక), దత్తూర (ఉమ్మెత్త), బదరీ (రేగు), అపామార్గ (ఉత్తరేణి), తులసీ పత్రం, చూతపత్రం (మామిడి), కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (అవిసె), దాడిమీ (దానిమ్మ), దేవదారు, మరువక, సింధూర (వావిలాకు), జాజి, గండకీ (కామంచి), శమీ (జమ్మి), అశ్వత్థ (రావి), అర్జున (మద్ది), అర్క (జిల్లేడు) పత్రులన్నీ ఔషధ గుణాలు కలిగినవే. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ప్రకృతి వైద్యం చెబుతోంది. వీటిలోనూ గరిక శ్రేష్టమైనది. ఇది చర్మవ్యాధులను నివారిస్తుంది. స్వామి నామావళితో దీనితో ప్రత్యేకంగా అర్చిస్తారు. నిరాడంబరతను నేర్పే వేలుపు వినాయకుడు. విలువైన నగలు, ఆభరణాలు కోరడు. ప్రకృతిలో లభించే పత్రాలను సేకరించి భక్తితో అర్చిస్తే సంతోషపడతాడు.

పార్వతీదేవి మంగళస్నానం సమయంలో ఆమె శరీర నలుగుపిండి ద్వారా వినాయకుడు రూపుదాల్చి నట్లు శివపురాణం చెబుతున్నందున ఆయన పృథ్వీ తత్త్వానికి ప్రతిబింబం. పాంచ భౌతికమైన శరీరంలో మూలాధారాన్ని పృథ్వీతత్త్వంతో మేళవిస్తారు. మూలాధార తత్త్వానికి అధినాథుడు వినాయకుడు. అందుకే మట్టి వినాయకుడిని పూజించడం వల్ల సత్వర ఫలితం చేకూరుతుందని పురాణ వచనం. కొండంత దేవుడికి కొండంత పూజాద్రవ్యాలు, కాను కలు సమర్పించలేమన్నట్లుగా ఉన్నంతలో భక్తి ప్రపత్తులతో మనస్ఫూర్తిగా ఆరాధించేలా ఈ మృత్తికా విగ్రహం ఉంటుంది. దానిని పూజిస్తే కొండంత కష్టాన్ని గోటితో తొలగిస్తాడని భక్తుల విశ్వాసం.