
( ఆగష్టు 24 – శ్రీ వెంకయ్య స్వామి వర్ధంతి )
ఆకలితో ఉన్నవాడికి అన్నంపెట్టు, పేదవాడి పట్ల కరుణ చూపించు, కష్టాల్లో ఉన్నవాడికి చేయందించు..గొలగమూడి వెంకయ్య స్వామి చేసిన కొన్ని బోధలివి. ఎవరీ వెంకయ్య స్వామి అని అడిగితే చెప్పడం కష్టమే. కొంతమంది ఆయన్ను క్యాన్సర్‌ను సైతం నయం చేసిన దేవ వైద్యుడంటారు. ఆధ్యాత్మికోన్నతికి మార్గం చూసిన దత్తాత్రేయ అవతారమని మరికొందరు అంటారు. అయితే ఎవరి మాట ఎలా ఉన్నా..మానవ లోకాన్ని ఉద్దరించేందుకే ఆ మహాపురుషుడు మన కర్మభూమిపై నడయాడారు అనేది మాత్రం నిజం..నెల్లూరు సమీపంలోని గొలగమూడి అనే చిన్నగ్రామానికి చెందిన వెంకయ్య స్వామి ధర్మానికి ప్రతిరూపంగా నిలిచారు. తన జీవితాంతం ధర్మాన్నే ఆచరించారు. తనను నమ్మి సహాయం కోరి వచ్చిన వారికి రక్షగా నిలిచాడు. విశ్వంలోని ప్రతి జీవిని ఆ భగవంతుడు ఎలా కాపాడుకుంటాడో అదే విధంగా వెంకయ్య స్వామి తన భక్తులను, శిష్యులను సదా కాపాడుకున్నాడు. వారిని దైవిక మార్గంలో నడిపించాడు. ఆయన మానవులనే కాదు తన సన్నిధికి వచ్చిన పశువులను సైతం ఆదరించాడు.
అవధూత వెంకయ్యస్వామి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకా నాగుల వెల్లటూరు అనే గ్రామంలో సోంపల్లి పెంచలయ్య, పిచ్చమ్మ అనే పుణ్యదంపతులకు 1887 మార్చ్ 11న జన్మించారు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో వెంకయ్యస్వామి చిన్నతనంలో కుటుంబపోషణ కోసం కూలిపనులకు వెళ్లేవారు. దయ, కరుణలతో ఉంటూ పశుపక్ష్యాదుల పట్ల ప్రేమ చూపుతుండేవారు. యుక్తవయస్సులో ఉన్నప్పుడు ఒకసారి తీవ్రజ్వరం రావడంతో స్వామి సమీపంలోని అడవికి వెళ్లిపోయారు. ఎప్పుడైనా ఊళ్లోకి రావడం, మిగిలిన సమయం అడవుల్లో ఉంటుండడంతో వెంకయ్యస్వామికి మతిభ్రమించిందని భావించేవారు. అలా కాలక్రమంలో పెంచలకోన, తిరుపతి, శ్రీశైలం అడవుల్లో యోగసాధన చేశారు. పెంచలకోన అడవుల్లో స్వామివారికి కణ్వమహర్షి అనుగ్రహం లభించిందని చెబుతారు.
వెంకయ్య స్వామి తరచుగా చాకలి యోగం మంగలి యోగం అని అరుస్తుండేవారు. చాకలి యోగం -మంగలి యోగం అంటే మన మనస్సుకి పట్టిన చెడు తలంపులని ఎప్పటికప్పుడు పరిశుబ్రం చేసుకోవాలని ఇంకా తలకి పట్టిన చెడు తలపులని కత్తిరించుకోవాలని… ఆ విధముగా బోధించేవారు. కానీ స్వామివారి అవధూత తత్వాన్ని అర్థం చేసుకోలేక జనం పిచ్చి వెంకయ్య అనేవారు. అనేక గ్రామాలు తిరిగి భగవాన్ వెంకయ్య స్వామిగా కోటితీర్థం చేరుకొని అక్కడ కొంత కాలం ఉన్నారు. ఆ తర్వాత గొలగమూడి గ్రామానికి చేరుకొని అక్కడే చిన్న పూరిపాకలో జీవితాన్ని గడిపారు. అలా ఆయన అక్కడే ఉంటూ పల్లె ప్రజల కష్టాలు తీర్చేందుకే బ్రతికారు. స్వామి పిలిస్తే పలికే దైవంగా భక్తులను ఆశీర్వదించారు. అన్ని జీవుల పట్ల ఎంతో దయతో ఉండేవారు.
వెంకయ్య స్వామి ఎల్లప్పుడూ “ఓం నారాయణ ,ఆదినారాయణ” అని ఒక కర్ర తంభూరతో పాటలు పాడేవారు. వారి మాటలు వారి బోధలు చాలా సరళంగా ఉండేవి. నమ్మితే సొమ్ము నమ్మకపోతే దుమ్ము..ఎవరైనా స్వామి చెప్పింది వినకపోతే పోతుంటే పోనిచ్చేదే గదయ్యా అనేవారు. మైసూరు మహారాజుని చూస్తే ఏం వస్తుందయ్యా మనకున్నదే మనది అని జీవిత సత్యాన్ని చెప్పేవారు. దేవుని సేద్యం చేస్తే ఆయనే అన్నం పెడతారని తన భక్తులకు స్వామి బోధించేవారు. దత్తాత్రేయుల వారు ఏ విధంగా అయితే తన భక్తుల వద్ద నుంచి భిక్ష తీసుకునేవారో వెంకయ్య స్వామి కూడా అదే విధంగా భక్తుల వద్ద భిక్ష తీసుకునేవారు. అలా తీసుకొని వారి కష్టాలను తొలిగించేవారు. వెంకయ్య స్వామి సమక్షంలో పేదలకు అన్నదానం జరుగుతున్నా కూడా ఆయన తన శిష్యులను భిక్షకు పంపించేవారు. వెంకయ్యస్వామి 1984 ఆగస్ట్ 24న గొలగమూడిలో మహాసమాధి చెందారు. భక్తులు ఆయనకు గుడి కట్టి ప్రతి ఏటా ఆగస్టు నెలలో ఆరాధనోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఆయన ఆరాధనోత్సవాల్లో భాగంగా ఎన్నో వేలమందికి అన్నదానం జరుగుతుంది. ఆయన జీవసమాధి నుంచే భక్తులను నేటికీ ఆశీర్వదిస్తూనే ఉన్నారు.





