
( ఆగష్టు 23 – టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి )
ధైర్యం..త్యాగం..ప్రకాశం
‘ఆపదలందు ధైర్యం అవసరం’ అని ఒక కవి తన పద్యంలో చెబుతాడు. ఎప్పుడూ ప్రజాసేవలో తలమునకలయ్యే నిజమైన నాయకులకు ఇది మరీ అవసరం. ‘ఆంధ్రకేసరి’ అనిపించుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటితరం నాయకులకు స్ఫూర్తిదాయకం. మద్రాసులో ‘సైమన్ గో బ్యాక్’ అంటూ తెలుగు వాళ్లు నిరసన తెలియజేస్తున్న సమయంలో టంగుటూరి ప్రకాశం పంతులు తుపాకీ గుండ్లకు గుండెలు ఎదురొడ్డి ప్రదర్శించిన ధైర్యసాహసాలు నిరుపమానమైనవి. అవే ఆయనను అశేషజనంతో ‘ఆంధ్రకేసరి’ అనిపించాయి. ‘రండిరా! ఇదె కాల్చుకోండిరా అని నిండు గుండె లిచ్చిన ఉద్ధండ మూర్తి’ అని కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి ప్రశంసించిన విషయం అందరికీ తెలుసు. అయితే ప్రకాశం పంతులు ఆంధ్రకే సరి కాదని యావత్ భారతానికే కేసరి అనిపించే దృష్టాంతాలు ఆయన జీవితంలో ఉన్నాయి.
ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో దిల్లీలోని ఆంధ్ర స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు. ప్రకాశం పంతులు దిల్లీకి వచ్చారని తెలిసిన అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయనను తన దగ్గరికి వెంటనే రమ్మని కోరుతూ ఒక మనిషిని పంపించారు. ‘నేను తెలుగు వాడి పనిమీద దిల్లీకి వచ్చాను. ఆ పని అయిన తరవాత సమయం ఉంటే వస్తానని ఆయనకు చెప్పు’ అని ప్రకాశం పంతులు నెహ్రూ దూతకు నిర్మొహమాటంగా చెప్పారట. మన దేశ తొలి ప్రధానమంత్రికి, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పంపిన వర్తమానం ఇది. ఇందుకు కూడా ప్రకాశం పంతులును ఆంధ్ర కేసరి అనవచ్చు కదా! తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన నిలిచారు కదా!
ప్రకాశం పంతులు అసలు సిసలు కేసరి అనడానికి ఇంకో నిదర్శనం కూడా ఉంది. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభలో ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు, అది నెగ్గింది. ఆయన ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అప్పుడు- పత్రికా విలేఖరులు ఆయనను కలిసి ఈ పరిణామాల గురించి మీరేమంటారు? అని అడిగారు. దానికి సమాధానంగా ప్రకాశం పంతులు ఒక చిరునవ్వు నవ్వి ‘కేసరి నవ్వింది అని రాసుకోండి’ అన్నారట. అంతే తప్ప ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి అక్రమాలకూ పాల్పడలేదట. ఎంత ఆకలైనా సింహం గడ్డి తినదుగా!
ప్రకాశం పంతులుగారు 1872 ఆగస్టు 23న జన్మించారు. తల్లి పేరు సుబ్బమ్మ, తండ్రి పేరు గోపాలకృష్ణయ్య. చిన్నతనం నుంచే కష్టించి చదివిన ప్రకాశం పంతులు 1904లో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేసి అనంతరం మద్రాస్ హై కోర్టులో ప్రాకీస్ట్ ప్రారంభించారు. సంపాదన బాగానే ఉన్నప్పటికీ దేశం కోసం వృత్తిని విడిచిపెట్టారు. వందేమాతరం, స్వదేశీ ఉద్యమాలను ముందుండి నడిపించారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రకాశం పంతులు అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారు.
టంగుటూరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి 1946లో ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రిగా మహాత్ముడి బాటలో అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నియమితులైన ప్రకాశం 84 ఏళ్ల వయసులో సైతం రాష్ట్రమంతా పర్యటిస్తూ వడదెబ్బకు గురై, 18 రోజులు ఉస్మానియా ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి పరమపదించారు. చిన్నతనం నుంచి ఆయన బాధలకు, దుఃఖాలకు కలత చెందలేదు. ఎదిరించి నిలబడ్డారు. ప్రజల శ్రేయస్సు కోసం తప్ప తన సుఖం కోసం పాకులాడలేదు. కుమారుడిగా, విద్యార్థిగా, శిష్యుడిగా, గురువుగా, పత్రికా సంపాదకుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రతి సందర్భంలో నమ్మిన సిద్ధాంతానికి నిలబడిన ప్రకాశంలోని పట్టుదల, నిర్భీతి, నిష్కపటం, నిష్కళంక వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శనీయం!




