News

కాంగ్రెస్ కు విడాకులు ఇచ్చేద్దాం: కేరళ సీపీఐ

181views

కాంగ్రెస్తో ఇంకా కలసి నడవడానికి సీపీఐ కేరళ శాఖలో ఏకాభిప్రాయం లేదా? అసలు సీపీఎంతో కలసి ఉన్నాం సరే, ఆ కూటమిలో కమ్యూనిస్టు లక్షణాలు ఏమైనా మిగిలాయా అన్న ప్రశ్న కూడా కేరళ సీపీఐలో ఉందా? తమ పార్టీలో కులతత్వం ఉందని సీపీఐలో కొందరు గట్టిగా భావిస్తున్నారా? సీపీఎం నాయకత్వమంటే సీపీఐ నాయకత్వానికి భయమా? ఇటీవల జరిగిన తిరువనంతపురం జిల్లా సీపీఐ సమావేశంలో జరిగిన వాడీవేడీ చర్చలలో ఈ అంశాలే బహిర్గతమయ్యాయి.

ఇక కాంగ్రెస్ను వదిలించుకుందాం అని కేరళ సీపీఐ లోనే ఒక వర్గం నాయకులు ఆ సమావేశంలో ప్రతిపాదించారు. భటిండా కాంగ్రెస్ నిర్ణయాన్ని పక్కన పెట్టి ఇక కాంగ్రెస్ను వీడి, సీపీఎంతో పొత్తు పెట్టుకుందామని వారు కోరారు. ఈ వర్గం నాయకుల కోరిక అలా ఉంటే, ఇంకొందరు మాత్రం అసలు కేరళలో వామపక్ష కూటమిలో కమ్యూనిస్టు విధానాలు ఏమంత సజావుగా ఉన్నాయి అని ప్రశ్నించారు. ఆ మంత్రివర్గంలో ఉన్న సీపీఐ సభ్యుడు జీఆర్ అనిల్ మీద కూడా విమర్శలు వెల్లువెత్తాయి. వామపక్ష కూటమి కమ్యూనిస్టు విధానాల ప్రకారం నడవడం లేదు కదా అన్నారు వీళ్లు.

అధికారంలో లేనప్పుడు స్నేహం చేసి, అధికారం వచ్చాక సీపీఐని సీపీఎం విస్మరిస్తున్నదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ వామపక్ష కూటమి ప్రభుత్వంలో పౌర సరఫరాల మంత్రి అనిల్ 13 నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని కూడా ఈ సమావేశం దుయ్యబట్టింది. ప్రభుత్వం అధీనంలో ఉన్న హెూర్టీ క్రాప్ సంస్థ అమ్ముతున్న కూరగాయల ధరలు బహిరంగ విపణిలో ధరల కంటే ఎక్కువగా ఉండడం ఏమిటని కొందరు నిలదీశారు. కన్స్యూమర్ ఫెడ్ పేరుతో ఉన్న సంస్థకు ప్రభుత్వ నిధులు కేటాయిస్తున్నారని, పౌర సరఫరాల శాఖ మాత్రం సీపీఐకి ఇచ్చారని విమర్శించారు. ఇంతకీ కన్స్యూమర్ ఫెడ్ సంస్థ సీపీఎం మంత్రుల చేతులలో ఉంది.

బహిరంగ విపణిలో తక్కువ ధరకు ఉన్నప్పటికీ కన్స్యూమర్ ఫెడ్ దగ్గర నుంచి కొనుగోలు చేయవలసిన అవసరం ఏమిటని కూడా కొందరు సీపీఐ నాయకులు నిగ్గదీశారు. నీలాంబర్ ఉప ఎన్నికలో ఓటమి నుంచి సీపీఎం పాఠాలు నేర్చుకోవాలని కూడా సీపీఐ సభ్యులు హితవు పలికారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి బినయ్ విశ్వంను కూడా చాలామంది సీపీఐ నేతలు దుమ్మెత్తి పోశారు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకేనా అర్ధమవుతున్నదా అని సందేహం వ్యక్తం చేశారు సభ్యులు. కిందిస్థాయి నాయకులు సీకే చంద్రప్పన్, వేలియం నుంచి ఆయన నేర్చుకుంటే మంచిదని బాహాటంగా విమర్శించారు. అసలు పార్టీలో కులతత్వం ఉందని కూడా కొందరు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆఖరికి రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు కె. రాజన్ను కూడా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. సీపీఎం నాయకత్వాన్ని చూసి సీపీఐ నాయకత్వం భయపడిపోతోందంటూ గొప్ప గొప్ప దేవరహస్యాలను బయటపెట్టేశారు.