News

రామాయణం పట్టు చీర

340views

అంచులపై అందంగా
ఆలయాల్లో కోరిన కోర్కెలు తీరినప్పుడు భక్తులు అమ్మవార్లకు చీరలు కానుకగా సమర్పించడం ఓ ఆనవాయితీ. అందుకు చీరల్ని షాపుల్లో కొని దేవాలయాల్లో ఇస్తుంటారు. అశేష భారతావనికోసం అయోధ్యలో రాముడి చెంత కొలువుదీరిన సీతమ్మకు ఓ చక్కని బహుమతి ఇవ్వాలనుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చేనేత డిజైనర్‌ నాగరాజ. నేత వృత్తి నేపథ్యం నుంచి వచ్చిన ఆ ఇద్దరూ ప్రత్యేకమైన చీరను రూపొందించాలనుకున్నారు.

అందుకోసం రామాయణంలోని నాలుగొందల ఘట్టాలను క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు వాటినే చీర మీదకు తీసుకొస్తే బాగుంటుంది అనిపించింది వారికి. వాటిల్లోంచి ముఖ్యమైన 168 ఘట్టాలను ఎంపిక చేసుకున్నారు. అవి చీర అంచులపైన నేస్తే ఒక క్రమపద్ధతిలో ఉంటుందని భావించారు. అంచులు సరే, మరి చీర సంగతి? చీరంతా ఖాళీగా కనిపిస్తే ప్రత్యేకత ఉండదు కదా. అలా అని మామూలు డిజైన్లు వేస్తే సాధారణ చీరలానే ఉంటుంది. అణువణువూ ఆధ్యాత్మికత వెల్లివిరియాలనే ఉద్దేశంతో పట్టుపోగులతో రామనామ జపాన్ని చీరంతా పరవాలనుకున్నారు. అందుకోసం ‘జైశ్రీరామ్‌’ పదంలోని అక్షరాలను తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఉర్దూతోపాటు శ్రీలంక దేశ భాష సింహళతో కలిపి- పదమూడు భాషల్లో, 32,200 పదాలను పట్టుచీరపై పొందుపరిచారు. అంచు విషయానికొస్తే 168 ఘట్టాలను 400 చిత్రాల రూపంలో కళ్లకు కట్టారు. కొన్నిచోట్ల ఆ ఘట్టాన్ని పదాలతో వర్ణించారు కూడా.

అంచులపై అందంగా
వ్యాసమహర్షి రామాయణాన్ని రాస్తున్న చిత్రం మొదలు… దశరథుడు శాపం పొందడం, పుత్రకామేష్ఠి యాగం చేయడం, రాముడు జన్మించడం, యుద్ధవిద్యలు నేర్చుకోవడం, శివధనుస్సు విరవడం, సీతను పెళ్లాడడం, అడవులకు వెళ్లడం, రావణుణ్ని జయించడం, లంక నుంచి సీతా సమేతంగా తిరిగి రావడం వంటి దశ్యాలన్నీ అంచుమీద ఆవిష్కృతమయ్యాయి. కళాత్మకంగా తీర్చిదిద్దిన ఈ ధర్మవరం పట్టుచీరను చేనేత మగ్గంపై దాదాపు నాలుగు నెలలపాటు శ్రమించి రూపొందించారు. అరవై మీటర్ల పొడవూ, పదహారు కిలోల బరువున్న ఈచీరకోసం ముందుగా డిజైన్లను నాగరాజు కంప్యూటర్‌లో డిజైన్‌ చేశాడు. వాటి ఆధారంగా కార్మికుడు సురేంద్రనాథ్‌ తన కొడుకుతో కలిసి నిష్ఠగా ఈ చీరను నేశాడు. ప్రతిరోజూ స్థానిక రామాలయంలో పూజలు చేసి భక్తిశ్రద్ధలతో పని పూర్తి చేశారు. చూడగానే చిన్నారులకు కూడా అర్థమయ్యేలా ఘట్టాలను అందంగా రూపొందించిన ఈ చీరలో కొలువుదీరిన సీతమ్మను చూస్తే భక్తిపారవశ్యంతో మనసు ఉప్పొంగదూ..!

గుహుడు సీతారామ లక్ష్మణులను పడవలో నది దాటిస్తున్న ఈ చిత్రం చేనేత పనితనానికి నిదర్శనం. చేనేతలో పలు జాతీయ అవార్డులు అందుకున్న శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన కళాకారుడు నాగరాజు దీన్ని పట్టు జరీపై నేశారు. ఇలాగే.. రామాయణంలోని 168 ఘట్టాలను 400 చిత్రాలతో 60 మీటర్ల పొడవైన పట్టు చీరపై చూడముచ్చటగా పొందుపర్చారు. రాముడి జననం, విద్యలు నేర్చుకోవడం, శివధనుస్సు విరవడం.. తదితర దృశ్యాలన్నీ చీర అంచులపై ఎంతో సృజనాత్మకంగా వచ్చేలా చేశారు. చీర మధ్యలో ‘జై శ్రీరామ్‌’ అని సింహళంతో పాటు 13 భాషల్లో నేశారు. ఈ రామాయణ చీర బరువు 16 కిలోలు.