
హిందూ దేవాలయాలపై ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుపై VHP తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వాలు కేవలం హిందూ దేవాలయాలపై మాత్రం జోక్యం చేసుకుంటోందని, నియంత్రణ చేస్తోందని VHP జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆక్షేపించారు. అలాగే హిందువులు దేవాలయాలకు సమర్పించే కానుకలు, సమర్పణలను లౌకిక విషయాలకు ప్రభుత్వం వాడుతోందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 2 నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు.
ఇందులో భాగంగా మొదటి దశలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు మెమోరండం సమర్పిస్తామని, అలాగే ప్రధాన నగరాల్లో మేధావులతో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు.
అలాగే జనాభా లెక్కలు, ఓటరు జాబితా సవరణలపై కూడా అలోక్ కుమార్ స్పందించారు. దేశంలో జనాభా లెక్కల ప్రక్రియ ప్రారంభం అవుతోందని, దాంతో పాటు విస్తృత హిందూ సమాజాన్ని విభజించే కుట్రలు కూడా తీవ్రమవుతున్నాయని విశ్వహిందూ పరిషత్ జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ పేర్కొన్నారు. హిందుత్వం అనేది కేవలం ఒకే గ్రంథాన్ని, ఒకే దేవుడ్ని, లేదా ప్రవక్తను నమ్మదని, విభిన్నమైన స్థానిక సంప్రదాయాలను స్వీకరిస్తుందన్నారు. జనాభా లెక్కల సమయంలో ఈ ఐకమత్యాన్ని గుర్తుంచుకోవాలని, విభజన కథనాలకు బలైపోవద్దని హిందువులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా అలోక్ కుమార్ ప్రత్యేకంగా లింగాయత్ ల గురించి ప్రస్తావించారు. బసవేశర్వరుడు కుల అడ్డంకులను తిరస్కరించిన ప్రపంచ గురువు అని, ఆయన శివ భక్తి ద్వారా మహిళా సాధికారత, భక్తిని ప్రోత్సహించారని గుర్తు చేశారు.
బిహార్ ఓటర్ల జాబితా సవరణపై….
బిహార్ లో జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణపై కూడా అలోక్ కుమార్ స్పందించారు. ఓటర్ల జాబితాలను దేశ వ్యాప్తంగా ప్రక్షాళన చేయాలని, దీని ఓ ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితాలోకి అక్రమంగా చొరబడ్డవారిని నిరోధించాలని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగేలా చూడాలన్నారు. అలాగే మరణించిన వారి పేర్లను కూడా ఓటరు జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బిహార్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా ఓటర్ల జాబితాపై సవరణ చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దీని ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడగలిగినవారు అవుతారని అన్నారు.
హిందూ దేవాలయాలపై…
హిందూ దేవాలయాలపై కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అలోక్ కుమార్ మండిపడ్డారు. ఇతర మతాల సంస్థలను ఏమాత్రం ముట్టుకోవడం లేదని, కానీ హిందూ దేవాలయాలను మాత్రం నియంత్రిస్తోందని దుయ్యబట్టారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మసీదులు, చర్చిలు, గురుద్వారాలను మాత్రం నియంత్రించదని, హిందూ దేవాలయాల విషయంలో మాత్రం జోక్యం చేసుకుంటుందన్నారు. హిందూ ఆస్తులను, కానుకలను లౌకిక ప్రయోజనాల కోసం మళ్లిస్తున్నారని, అది వివక్షే అవుతుందని ప్రకటించారు.




