
దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న ఇద్దర్ని యూపీ ఉగ్రవాద నిరోధక దళం అరెస్ట్ చేసింది. ‘‘రివైవింగ్ ఇస్లాం’’ అనే వాట్సాప్ గ్రూపుతో వీరు కనెక్ట్ అయ్యారని, చాలా మంది పాకిస్తానీయులు కూడా ఇందులో సభ్యులుగా వున్నట్లు ఏటీఎస్ పోలీసులు పేర్కొన్నారు. వీరిద్దరూ దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా వుంటున్నారని ఏటీఎస్ ప్రకటించింది. అలాగే యూపీలోని అమ్రోహా నివాసి అజ్మల్ అలీ బృందంతో కూడా వీరికి సంబంధాలున్నాయి. వీరిద్దరి అరెస్ట్ ను యూపీ లా అండ్ ఆర్డర్ డీజీ అమితాబ్ యష్ ధ్రువీకరించారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని, కస్టడీ రిమాండ్ తీసుకుంటామని ప్రకటించారు.
కొన్ని రోజుల క్రిందటే దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నట్లు అనుమానాలున్న అజ్మల్ అలీని ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది. అజ్మల్ అలీ కూడా ‘‘రివైవింగ్ ఇస్లాం’’ అనే వాట్సాప్ గ్రూపుతో సంబంధాలను నెరుపుతున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అంగీకరించాడు కూడా. సోషల్ మీడియా మాధ్యమంగా… అనేక మంది పాకిస్తానీయులతో కూడా సంబంధాలున్నట్లు అంగీకరించాడు. ఈ వ్యక్తితోనే తాజాగా అరెస్టైన ఇద్దరికి కూడా సంబంధాలున్నాయి.
ఈ వాట్సాప్ గ్రూపులో భారత్ లో నడుస్తున్న ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టడం, షరియా చట్టాన్ని అమలు చేయడం, భారత్ వ్యతిరేక కార్యకలాపాల గురించి చర్చిస్తూ, షేర్ చేస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత నిఘా పెట్టారు. మరో వైపు ఇదే వాట్సాప్ గ్రూపుతో సంబంధమున్న మహారాష్ట్రలోని ఒసామా అనే వైద్యుడ్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ పై లక్నోకు తీసుకొస్తున్నారు.




