News

మహారాష్ట్రలో భారీగా ‘‘Made in pakisthan’’ కాస్మోటిక్స్ సీజ్

18views

మహారాష్ట్రలోని అహల్యానగర్ జిల్లాలోని గోల్డెన్ మార్కెట్ లో అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీగా ‘‘మేడిన్ పాకిస్తాన్’’ ముద్ర వున్న కాస్మోటిక్స్ ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు.ఈ కేసులో దుకాణుదారులను అదుపులోకి తీసుకొని, విచారణ చేస్తున్నారు. భారత్‌లో విక్రయించడానికి ఎటువంటి అధికారిక అనుమతి లేని ఈ సౌందర్య ఉత్పత్తులపై ‘మేడ్ ఇన్ పాకిస్తాన్’ అని స్పష్టంగా ముద్రించి ఉన్నట్లు కనుగొన్నారు. వీటిని అక్రమంగా మార్కెట్లో విక్రయించొద్దని నిబంధనలు పేర్కొంటున్నాయి. అయినా సరే ఎవరు వీరికి సప్లై చేస్తున్నారు? ఎలా మార్కెట్ లోకి వచ్చాయన్నది మాత్రం తెలియడం లేదు. పోలీసులు దీనిపై దర్యాప్తును ప్రారంభించారు.

ఈ సీజ్ చేసిన వస్తువుల్లో అత్యంత హానికరమైన గోరీ బ్యూటీ క్రీమ్,గోరీ డే అండ్ నైట్ క్రీమ్ కూడా వుందని పోలీసులు ప్రకటించారు. ఈ ఉత్పత్తులు మానవ చర్మానికి తీవ్ర హానిని కలిగిస్తాయని, తీవ్ర అనారోగ్యాన్ని కూడా కలిగిస్తాయని వెల్లడించారు. ఎటువంటి లైసెన్స్ లేదా ప్రభుత్వ అనుమతి లేని ఈ నిరోధిత పాకిస్తానీ ఉత్పత్తులు అహల్యానగర్ వరకు ఎలా చేరుకున్నాయి? దీని వెనుక ఏ నెట్‌వర్క్ క్రియాశీలంగా పనిచేస్తోంది? అనే విషయాలపై FDA మరియు పోలీసు యంత్రాంగం సంయుక్తంగా దర్యాప్తు చేస్తున్నాయి.

“తమకు అందించిన సమాచారం ఆధారంగా సంగంనేర్‌లోని గోల్డెన్ మార్కెట్‌లో ఈ సంయుక్త దాడి జరిగింది. దుకాణం నుండి సుమారు ₹14,000 విలువై న పాకిస్తానీ కాస్మోటిక్స్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ స్టాక్‌ను అతనికి ఎవరు సరఫరా చేశారో తెలుసుకోవడానికి దుకాణదారుడు షాహిద్ రియాజ్ షేక్ (36)ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.” అని పోలీసు అధికారులు ప్రకటించారు.

అధికారుల ఈ ఆకస్మిక చర్యతో స్థానిక వ్యాపారుల్లో కలకలం రేగింది. ఆరోగ్యంతో చెలగాటమాడే ఇటువంటి అక్రమ మరియు నిరోధిత విదేశీ సౌందర్య సాధనాల విక్రయాలను ఏమాత్రం సహించేది లేదని FDA అధికారులు స్పష్టం చేశారు. ఈ అక్రమ రవాణా నెట్‌వర్క్ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకునేందుకు పోలీసులు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు.