
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాలేగావ్ బాంబు పేలుళ్ల(2008) తర్వాత హిందువులను ఉగ్రవాదులుగా చిత్రీకరించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆరోపించారు. ఆరెస్సెస్‌లోని కొందరు నేతలను, హిందుత్వవాదులను లక్ష్యంగా చేసుకున్న ఆ పార్టీ ప్రణాళికా ప్రకారమే వారిపై ఉగ్రవాదులనే ముద్ర వేయాలని చూసిందని పేర్కొన్నారు.
నాగ్‌పుర్‌లోని ఓ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ‘‘అప్పటి యూపీఏ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడింది. ప్రపంచంలో ముస్లిం జనాభా ఉన్న ఏ ప్రాంతంలో బాంబు పేలుళ్లు జరిగినా దానికి హిందూ ఉగ్రవాదం, కాషాయ ఉగ్రవాదం లాంటి పదాలను సృష్టించింది. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు వెనక ఉన్న కుట్ర ఇప్పుడు అందరి ముందు బహిర్గతమైంది. దాడి జరిగిన సమయంలో ఇస్లామిక్ ఉగ్రవాదం ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. కానీ అందరు ముస్లింలు ఉగ్రవాదులే అని ఎవరూ అనలేదు. అయితే అప్పుడు కాంగ్రెస్ హిందువులందరినీ ఉగ్రవాదులుగా చూపించే ప్రయత్నం చేసింది’’ అని ఫడణవీస్ అన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో ఆరెస్సెస్ ప్రముఖుడు మోహన్ భాగవత్‌ను ఇరికించడానికి కాంగ్రెస్ కుట్ర చేసిందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. ఇది ఆరెస్సెస్‌ను, హిందూ మతాన్ని అపఖ్యాతిపాలు చేసేందుకు వేసిన పథకమని ఆయన వ్యాఖ్యానించారు.





