News

గుడిలో అనధికార హుండీ.. అధికారులు రావడంతో ఎత్తుకెళ్లిన డీఎంకే కార్యకర్త

218views

ఒక వ్యక్తి గుడిలో అనధికారంగా హుండీ ఏర్పాటు చేశాడు. ఈ సమాచారం తెలిసిన అధికారులు ఆ గుడి వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో భక్తుల కానుకలతో నిండిన ఆ హుండీని ఆ వ్యక్తి ఎత్తుకెళ్లాడు.తమిళనాడులోని పెరంబలూరులో ఈ సంఘటన జరిగింది. కొలత్తూరు ప్రాంతంలోని సుందరమూర్తి అయ్యనార్ ఆలయానికి చెందిన డీఎంకే కార్యకర్త తునైవేందన్‌ ఒక హుండీని అక్కడ ఏర్పాటు చేశాడు.

కాగా, ఈ సమాచారం తెలిసిన దేవాదాయ శాఖ అధికారులు ఆ ఆలయానికి చేరుకున్నారు. అనధికారంగా ఏర్పాటు చేసిన హుండీని సీజ్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే డీఎంకే కార్యకర్త తునైవేందన్‌ ఆ అధికారులను బెదిరించాడు. అతడు ఏర్పాటు చేసిన కానుకలతో నిండిన ఆ హుండీని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయాడు.

మరోవైపు తమిళనాడుకు చెందిన బీజేపీ నాయకుడు కే అన్నామలై ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్‌ చేశారు. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై ఆయన ఆగ్రహించారు. ‘డీఎంకే పాలనలో దేవాలయాలు కూడా రాజకీయ దోపిడీ నుంచి తప్పించుకోలేవు. తాము దీనిని ఎత్తి చూపడం ఇదే మొదటిసారి కాదు’ అని విమర్శించారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో డీఎంకే కార్యకర్త తీరుపై నెటిజన్లు కూడా మండిపడ్డారు.