News

దేవాలయాల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు.. సైబర్ నేరగాళ్ల ముఠా అరెస్ట్

211views

దేశంలోనే సంచలనాత్మకంగా మారిన సైబర్ క్రైమ్ కేసును పోలీసులు చేధించారు. పర్యాటక ప్రాంతాలు, దేవస్థానాల పేర్లతో నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి ప్రజలను మోసం చేసిన సైబర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు నిందితులను బాపట్ల జిల్లా పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే.. అరెస్టైన నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలోని దిగ్ జిల్లా పహాడి తాలూకా సహసన్ గ్రామానికి చెందిన పరంజీత్(20), బిట్టూ(21)గా పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని పహారి, జుహేరా పోలీస్ స్టేషన్‌లలో నమోదైన కేసులతోపాటు.. దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ఈ సైబర్ నేరగాళ్ల ముఠాపై మొత్తం 127 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ క్రమంలో బాపట్ల జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించారు. సూర్యలంకలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) నిర్వహిస్తున్న హరిత రిసార్ట్స్‌కి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి, పర్యాటకులను మోసం చేశారని పేర్కొన్నారు. అలాగే, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD), శ్రీశైలం దేవస్థానం (AP) మరియు త్రయంబకేశ్వర్ దేవస్థానం (మహారాష్ట్ర) పేర్లతో నకిలీ వెబ్‌సైట్ల ద్వారా భక్తులను మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందం రాజస్థాన్‌లోని దిగ్ జిల్లాలోని సహసన్ ప్రాంతానికి వెళ్లి.. జూలై 23 న నిందితులను అరెస్టు చేయడంతో పాటు, నిందితులలో ఒకరైన పరంజీత్ వద్ద నుంచి OPPO F27 PRO 5G మొబైల్ ఫోన్ రెండు సిమ్ కార్డులతో సహా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో నిందితులను హాజరు పరిచి ట్రాన్సిట్ రిమాండ్ ద్వారా గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. తదుపరి విచారణ కొరకు నిందితులను ఆగస్టు 1, 2 తేదీలలో పోలీస్ కస్టడీలోకి తీసుకుని విచారణ చేసేందుకు పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడీ బాపట్ల IT/సైబర్ కోర్ టీం మరియు రూరల్ పోలీస్ స్టేషన్ అధికారులను అభినందించారు.