ArticlesNews

మైత్రి ఆరోప్రాణం

254views

( ఆగస్టు 3 – స్నేహితుల దినోత్సవం )

పంచప్రాణాలకు తోడు ఆరోప్రాణం మరొకటుంది. అదే స్నేహం. మైత్రి అంత గొప్పది కనుకనే భగవంతుడిని చేరే నవవిధ భక్తిమార్గాల్లో సఖ్యభక్తికి ప్రత్యేక స్థానం కల్పించారు.

జీవనయాత్రలో తోడునీడగా ఉండే ఒక మంచి నేస్తానికి ఎలాంటి లక్షణాలుంటాయనే విషయాన్ని ‘అఘము వలన మరల్చు, హితార్థకలితుఁ జేయు, గోప్యంబు దాఁచు, బోషించు గుణము, విడువఁడాపన్ను, లేవడివేళ నిచ్చు మిత్రుఁడీ లక్షణంబుల మెలగుచుండు’ అనే సుభాషితం వివరిస్తుంది. మంచి మిత్రుడు ఎన్నడూ తన నేస్తం చెడుపనుల జోలికి వెళ్లకుండా చూస్తాడు. స్నేహితుడి రహస్యాలను కాపాడుతూ సద్గుణాలను మెచ్చుకుంటాడు. ఆపదలో వదిలేసి వెళ్లిపోడు. ఏది అవసరమైనా సందేహించక అందిస్తాడు. ఇవి నిజమైన మిత్రుడి లక్షణాలనేది ఈ పద్య భావం. మనకు అనునిత్యం సన్మార్గాన్ని సూచించే పురాణేతిహాసాల్లో ఇలాంటి స్నేహానికి అనేక చక్కని ఉదాహరణలున్నాయి.

భారతంలో కర్ణ-దుర్యోధనులు, భాగవతంలో కృష్ణ-సుదాములు, రామాయణంలో రామ-సుగ్రీవులు మైత్రికి నిర్వచనం అంటే అతిశయం కాదు. సీతమ్మను వెతకడంలో రాముడికి సుగ్రీవుడు సహాయం చేశాడు. వీరి స్నేహం పరస్పర సహాయం, నమ్మకం, విధేయతలకు ప్రతీక. కృష్ణ కుచేలుల కథ స్నేహానికే మణికిరీటం. వాళ్లిద్దరూ ఒకే గురువు దగ్గర చదివారు. విద్యార్థి దశలో ఆస్తులు, అంతస్థుల తారతమ్యాల్లేక కలిసిమెలిసి ఉండటం సహజం. కానీ జీవితంలో స్థిరపడటం వేరుగా ఉంటుంది. చెదరని చెలిమికి సాక్ష్యం కృష్ణకుచేలులు కాగా, మారిన వైఖరికి నిదర్శనం ద్రోణ ద్రుపదులు.

కుచేలుడు దారిద్య్రాన్ని భరించలేక తన చిన్ననాటి స్నేహితుడు కృష్ణుడు సాయం చేస్తాడన్న నమ్మకంతో వెళ్లి కలిశాడు. ఆ నమ్మకం వమ్ముకాలేదు. ద్రుపద ద్రోణులూ బాల్యమిత్రులే. పైగా ద్రోణుడికి పెద్దయ్యాక సాయం చేస్తానని ద్రుపదుడు మాట ఇచ్చిన సందర్భం ఉంది. దుర్భర పరిస్థితి తలెత్తినప్పుడు ద్రోణుడు మిత్రుణ్ని సాయం అడిగాడు. కానీ అవమానమే ఎదురైంది. ఫలితంగా అనంతర కాలంలో తన శిష్యులైన పాండవులు ద్రుపదుణ్ని ఓడించేలా చేశాడు ద్రోణుడు. అతడిని రథానికి కట్టించి తన వద్దకు తెప్పించుకుని పగ తీర్చుకున్నాడు.

అగ్నిసాక్షిగా…
రామాయణంలో రామ సుగ్రీవుల మైత్రి అగ్నిసాక్షిగా ప్రారంభమైంది. వివాహ సమయంలో వధూవరులు అగ్ని ప్రదక్షిణ చేస్తారు. అలా ఏడడుగులు నడిచేటప్పుడు ‘మనిద్దరం మంచి స్నేహితుల్లా ఎప్పటికీ కలిసుందాం’ అని వాగ్దానం చేస్తారు. ఈ ఆచారం వివాహానికి స్నేహపరిమళాన్ని అద్ది స్నేహంలోని పవిత్రత, స్వచ్ఛతలను చాటుతుంది. ఈ సంగతి అర్థం చేసుకుంటే ఆలుమగల మధ్య గొడవలకు తావుండదు.

కష్టాలలో వెన్నంటి..
భారతంలో కర్ణదుర్యోధనులు అపురూప మైత్రికి ఉదాహరణ. విద్యా ప్రదర్శన సమయంలో కర్ణుడు అవమానాన్ని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడు వెంటనే తండ్రి సహాయంతో అతడిని అంగరాజ్యానికి రాజును చేశాడు. అందుకు ప్రతిగా కర్ణుడు దుర్యోధనుడి కోసం తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. భారతంలోనే స్నేహానికి మరో ఉదాహరణ కృష్ణార్జునులు. వీరు బావాబావమరుదుల కంటే స్నేహితులంటేనే సరిపోతుంది. అర్జునుడి రథానికి తనే సారథి అయ్యి నడిపించాడు శ్రీకృష్ణుడు.

కొందరితో స్నేహం కష్ట నష్టాలకే దారితీస్తుంది. కనుక అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలని హితవు పలికింది గరుడపురాణం. వీరు అయిదు రకాలుగా ఉంటారు. ఇందులో మొదటివాడు అదృష్టం మీద ఆధారపడి జీవించేవాడు. ఏ పనీ చేయడు సరికదా మిత్రులనూ అలాగే జీవించమని ప్రేరేపిస్తాడు. ప్రతికూల మనస్తత్వం ఉన్న వ్యక్తులు రెండో రకం. వీరిలో సానుకూలత ఉండదు. ఇతరుల విజయానికి అడ్డంకిగా మారతారు. అహాన్ని ప్రదర్శించేవారు మూడో రకం. వీళ్లు గర్వాతిశయంతో ఇతరులను బాధిస్తారు, వేదనకు గురిచేస్తారు. నాలుగో రకం దుష్ట సలహాలు ఇచ్చేవారు. వీళ్లు ఏ పనినీ సరిగ్గా చేయరు, ఇతరులు చేసినా సహించరు. పనులకు ఆటంకం కలిగించి, వ్యర్థ విషయాలతో కాలయాపన చేస్తారు. సోమరులు అయిదో రకానికి చెందుతారు. ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేసినవారు కూడా సోమరులుగా మారటం తప్ప సాధించేదేమీ ఉండదు. అందుకే ఇలాంటి అవగుణాలున్న వారితో స్నేహం చెయ్యకూడదన్నది ఆర్యోక్తి.