
పదిహేడేళ్లనాటి మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుపై విశ్వహిందూ పరిషత్ స్పందించింది. జిహాదీ ఉగ్రవాదులను కాపాడటానికి కాంగ్రెస్ కాషాయ ఉగ్రవాదం అనే తప్పుడు కథను సృష్టించిందని, ఈ కుట్ర ఈ రోజు బయటపడిందని జాతీయ సహ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ లోని అందరు నేతలూ హిందూ సమాజానికి మాత్రమే కాకుండా మొత్తం దేశానికే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పదిహేడేళ్లనాటి మాలేగావ్ పేలుళ్ల కేసుపై ముంబై ప్రత్యేక కోర్టు గురువారం తీర్పునిచ్చింది. సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్, లెఫ్టినెంట్ కర్నల్ ప్రసాద్ పురోహిత్ సహా ఈ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురినీ నిర్దోషులుగా ప్రకటించింది. వారికి వ్యతిరేకంగా ఈ కేసులో ఎలాంటి బలమైన, నమ్మదగ్గ సాక్ష్యాలేవీ లేవని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
పేలుళ్లకు ఉపయోగించిన బైక్ ప్రజ్ఞా ఠాకూర్‌దేనని, ఆ బైక్ ఆమె పేరిటే రిజిస్టర్ అయ్యిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని… ఆ బైక్‌పైనే బాంబు పెట్టి పేల్చారన్న విషయాన్ని నిర్ధారించలేకపోయిందని.. కేవలం అనుమానంతో ఎవరినీ దోషులుగా ప్రకటించలేమని వ్యాఖ్యానించింది. ఉగ్రవాదానికి మతం లేదని.. ఈ కేసును విచారించిన ప్రత్యేక జడ్జి ఏకే లహోటీ పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయన్న ఆయన.. నిందితులపై ఆరోపణలు పూర్తిగా నిరూపించలేకపోయినందున వారికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వడం సముచితమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ఈ కేసులో ఉపా (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) నిబంధనలు వర్తించవని తేల్చిచెప్పారు.





