
బ్రిటిష్ హయాంలో భారత్ నుంచి తరలిపోయిన బుద్ధుని పవిత్ర అవశేషాలను.. 127 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దేశ సాంస్కృతిక వారసత్వానికి సంతోషకరమైన రోజుగా పేర్కొన్నారు. 1898లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని పిపర్‌హవా ప్రాంతంలో చేపట్టిన తవ్వకాల్లో బయటపడిన ఆ పవిత్ర అవశేషాలను.. వలస పాలన సమయంలో మన దేశం నుంచి తరలించారని గుర్తుచేశారు.
‘‘బుద్ధుని పవిత్ర ‘పిపర్‌హవా’ అవశేషాలు 127 ఏళ్ల తర్వాత తిరిగి భారత్‌కు తీసుకురావడం దేశవాసులందరికీ ఎంతో గర్వకారణం. బుద్ధుడు, ఆయన బోధనలతో దేశానికి ఉన్న అనుబంధాన్ని ఈ పవిత్ర అవశేషాలు చాటిచెబుతున్నాయి. అదేవిధంగా అద్భుతమైన సంస్కృతిని పరిరక్షించడం పట్ల మన నిబద్ధతను చాటుతున్నాయి. ఈ అవశేషాలు 1898లో వెలుగులోకి వచ్చాయి. కానీ.. వలసపాలనలో భారత్ నుంచి వేరే ప్రాంతానికి తరలించారు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ అంతర్జాతీయ వేలంలో అవి కనిపించాయి. దీంతో వాటిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకున్నాం. ఇందులో భాగమైన వారందరికి అభినందనలు’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
పిపర్‌హవా ప్రాజెక్టు వెబ్‌సైట్ వివరాల ప్రకారం.. 1898లో యూపీలో భారత్- నేపాల్ సరిహద్దు సమీపంలోని పిపర్‌హవాలో ఓ పురాతన బౌద్ధ స్తూపం తవ్వకాల సమయంలో పెద్ద రాతిపెట్టెలో కొన్ని అవశేషాలు బయటపడ్డాయి. ఇందులో గౌతమ బుద్ధునికి చెందినవిగా భావిస్తున్న అస్థి అవశేషాలు, పేటికలు, బంగారు ఆభరణాలు, రత్నాల వంటివి ఉన్నాయి. బౌద్ధులకు పంపిణీ చేసేందుకుగానూ.. ఆ పవిత్ర అస్థి అవశేషాలను సియామ్ (ప్రస్తుత థాయ్‌లాండ్) రాజుకు అప్పగించినట్లు వెబ్‌సైట్ చెబుతోంది. అప్పట్లో అవశేషాలను ఉంచిన ఆ పెద్ద రాతి పెట్టె ప్రస్తుతం కోల్‌కతాలోని ఇండియన్ మ్యూజియంలో ఉంది.





