ArticlesNews

సనాతన సాంస్కృతిక వారధులు శ్రీ గోస్వామి తులసీదాసు మహాశయులు

263views

( శ్రావణ మాసం ఏడవ రోజు – తులసీదాసు జయంతి )

హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని ఏడవ రోజున తులసీదాసు పుట్టినరోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం తులసీదాసు జయంతి 31 జూలై 2025 గురువారం జరుపుకుంటున్నాము. తులసీదాసు గొప్ప కవి. రామచరిత మానస్‌ను సృష్టించిన ఘనత ఆయనది. మహాకవి తులసీదాసు తన జీవితమంతా రామ భక్తుడిగానే గడిపాడు. రామచరితమానస్‌, దోహావళి, కవితావళి, గీతావళి, వినయ పీఠిక, జానకీ మంగళ్‌, రామలాల నహచాచు, రామాంజ ప్రసన్న, పార్వతి మంగళ్‌, కృష్ణ గీతావళి, హుమాన్‌ బాహుక, సంకట మోచనస వైరాగ్య సందీపిని, హనుమాన్‌ చాలీసా వంటి గొప్ప కావ్యాలను రాశారు. ఈ కావ్యాల‌న్నీ ఆయ‌న‌ను గొప్ప కవిని చేశాయి. తులసీదాసును ఆధ్యాత్మిక గురువుగా కూడా పరిగణిస్తారు.

తులసీదాసు తండ్రి ఆత్మారాముడు, తల్లి హులసీ. తులసీదాసు జన్మించినప్పుడు అయిదు సంవత్సరాల బాలుడిలా కనిపించాడట. తల్లితండ్రులు అతని విలక్షణ రూపానికి భయపడి తమ ఇంటి దాసి మునియాకు పెంచుకోవ‌డానికి ఇచ్చారు. తరువాత కొద్దికాలానికి ఆతనిని పెంచుకొన్న మునియా దాసి కూడా చనిపోయింది. అపుడు బాబా నరహరిదాసు అనే సాధువు ఆ అనాథ బాలుడైన తులసీదాసుని పెంచి విద్య నేర్పారు. తరువాత శేష సనాతనుడనే శ్రేష్ఠుని దగ్గర తులసీదాసు వేద, వేదాంగాలు అభ్యసించాడు. తులసీదాసు అనాథ బాలుడైనా ఆతని రూప, గుణ, శీల, స్వభావ, విద్వత్తులకు ముగ్ధుడై ఒక కులీన బ్రాహ్మణడతనికి తన కూతురునిచ్చి వివాహం చేశాడు. తన భార్య రత్నావళి అంటే తుల‌సీదాసు ఎంతో ప్రేమ చూపించేవాడు. అయితే ఒకసారి ఆయన ఇంట్లో లేనప్పుడు రత్నావళి పుట్టింటికి వెళ్ళింది. ఈవార్త తెలియగానే తులసీదాసు ఆమెను కలుసుకునేందుకు బయలుదేరాడు. చిమ్మ చీకటి, దానికితోడు కుంభవృష్టి పడుతూవుంది. అటువంటి సమయంలో గంగానదిని దాటి భార్య ఇంటికి చేరుకొన్నాడు. అప్పుడు అతని భార్య రత్నావళి చేసిన హెచ్చరిక అతని జీవితాన్నే మార్చేసింది.

నాధా! ఎముకలు, చర్మంతో కూడిన ఈ దేహంపై ఉన్నంత ప్రేమ ఆ శ్రీరాముని మీద ఉంటే భవభీతియే యుండదుగదా! అన్న రత్నావళి మాటలే తులసీదాసుకు తారకమంత్రమయ్యాయి. అప్పటి నుంచి తులసీదాసు విరాగియై శ్రీరామచంద్రుని భక్తిలో నిమగ్నుడైనాడు. కాశీ, అయోధ్యలు ఆయనకు నివాసస్థానాలయ్యాయి. జీవిత చరమదశలో ఆయన కాశీలోనే ఉన్నారు. లోకకల్యాణ కరమైన ‘రామచరితమానస్’ మహాకావ్యాన్ని వ్రాయడం తులసీదాసు అయోధ్యలోనే ప్రారంభించాడు. తరువాత కాశీలో ఉంటూ రెండున్నర సంవత్సరాలలో రామచరితమానస్ పూర్తి చేశాడు. తులసీదాసు సంస్కృతంలో మహాపండితుడైవుండి కూడా రామాయణగాధను అయోధ్య ప్రాంత భాషయైన అవధీలో వ్రాశాడు. దేశీయ చంధస్సులైన దోహా, చౌపాయి, కవిత్త మొదలైన చంధస్సులలో వ్రాయడం చేత, సరళమైన సంస్కృత, తత్త్సమశబ్దాలతో కూడిన అవధీభాషలో వ్రాయడంచేత తులసీ రామాయణం లోకప్రసిద్ధి పొందింది.

గోస్వామి తులసీదాసును వాల్మీకి అవతారమని అంటారు. భక్తిభావం, కావ్య రచన, తాదాత్మ్యత, భాష – వీటిని చూస్తే ఆయన అపర వాల్మీకి అనటానికి ఏ సందేహమూ లేదు. తులసీదాసు తన జీవిత కాలంలో సంస్కృతంతో పాటుగా హిందీలో 22 రచనలు చేశాడు. ఈయన కేవలం రచయితగానే ప్రసిద్ధుడు కాదు, కొడిగడుతున్న హిందూ జ్వాలను భక్తి ఉద్యమం ద్వారా మళ్ళీ ప్రజ్వరిల్లేట్లుచేసిన మహా భక్తుడు. ఈయన ఉత్తర భారతదేశమంతా పర్యటించి ” అఖాడా”ల స్థాపన ద్వారా యువతలో పోరాట పటిమను కలిగించారు. ముస్లిం దండయాత్రలు, మతమార్పిడి మౌఢ్యం నుంచి హిందూ సమాజం తననుతాను కాపాడుకోవడంలో ఈ మహత్ముడు పోషించిన పాత్ర అనిర్వచనీయమైనది. తులసీదాసు స్థాపించిన అఖాడాలు కులాలకతీతంగా నిర్వహించబడేవి. ఇప్పటికీ ఆ అఖాడాలు కొనసాగుతూ ఉండటం గమనార్హం. ఎన్నో ఆంజనేయ స్వామి ఆలయాలను తులసీదాసు స్థాపింపజేశారు. వారణాసిలో సంకటమోచన్‌ దేవాలయాన్ని కట్టించాడు. ప్రతీ భారతీయుడు తన సాంస్కృతిక, ఆధ్యాత్మిక జీవన విధానాన్ని కొనసాగించాలంటే ఇలాంటి మహనీయుల జీవితచరిత్రలను తప్పక తెలుసుకోవాలి.