News

టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి పచ్చజెండా..

247views

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ -TRFకు చెందిన ఉగ్రవాదులు విచక్షణారహితంగా దాడికిపాల్పడిన సంగతి తెలిసిందే. దీన్ని ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి-UNSCని భారత్ ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తోంది. ఈ క్రమంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలు విధించేందుకు యూఎన్‌ఎస్సీ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇటీవలే దీన్ని అమెరికా ఉగ్రసంస్థగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

యూఎన్‌ఎస్సీ పర్యవేక్షణ కమిటీ తన తాజా నివేదికలో టీఆర్‌ఎఫ్‌ గురించి అధికారికంగా ప్రస్తావించింది. పహల్గాంలో జరిగిన దాడి ప్రదేశానికి సంబంధించిన ఫొటోను టీఆర్‌ఎఫ్‌ తన వెబ్‌సైట్లో ప్రచురించినట్లు అందులో తెలిపింది. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ లష్కరే తయిబా-LeT మద్దతు లేకుండా ఈ దాడి జరగలేదన్న వాదనలను కూడా ప్రస్తావించింది. ఉగ్రవాద గ్రూపులు ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణమవుతాయని ఈసందర్భంగా హెచ్చరించింది. ఉగ్రవాదాన్ని నిరోధించేందుకు ముందస్తు చర్యలు అవసరమని నొక్కి చెప్పింది. ఈ నివేదిక తదుపరి యూఎన్‌ఎస్సీ ఆంక్షల కమిటీ పరిశీలించనుంది. అనంతరం టీఆర్‌ఎఫ్‌పై ఆంక్షలు విధించాలనే ఆలోచనలో కూడా ఈ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రపంచ వేదికలపై న్యూదిల్లీ భారీ దౌత్య విజయం సాధించినట్లు అవుతుంది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గల ప్రముఖ పర్యాటక ప్రాంతం బైసరన్‌ లోయ వద్ద ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. లష్కరే తయిబా అనుబంధ సంస్థ ‘ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌’కు చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. ఈ దాడిని ప్రపంచమంతా ఖండించింది. ఆ తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్‌ చేపట్టి పాక్‌పై దాడి చేసి ఉగ్రమూకల క్యాంపులను ధ్వంసం చేసింది. ఇక, ఇటీవల టీఆర్‌ఎఫ్‌ను విదేశీ ఉగ్రవాద సంస్థ-FTOగా, ప్రత్యేకంగా ముద్ర పడిన అంతర్జాతీయ ఉగ్రవాది-SDGTగా అమెరికా ప్రకటించింది. దీన్ని భారత్‌ స్వాగతించింది.