
తిరుపతి జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద కోట మండలం చిట్టేడులోని గిరిజన గురుకుల బాలుర పాఠశాలను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్‌గా పాఠశాల విద్యార్థులు, డీఈవో, సమగ్రశిక్షా అధికారులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎంశ్రీ) పథకం ప్రారంభించి నేటికి ఐదు సంవత్సరాలు కావస్తోన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా పీఎంశ్రీ పాఠశాలలను జాతికి అంకితంచేసే కార్యక్రమాన్ని ఢిల్లీ నుంచి వర్చువల్‌గా కేంద్రమంత్రి మంగళవారం ప్రారంభించారు.
44 పాఠశాలల్లో పథకం అమలు
పథకం కింద జిల్లాలో ఎంపికైన 44 పాఠశాలల్లో అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2023-24లో 23, 24-25లో 17, ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో నాలుగు పాఠశాలలు ఎంపికయ్యాయి. మొదటి రెండు దశలకు సంబంధించి పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిమిత్తం రూ.8.50 కోట్లు మంజూరుకాగా రూ.7.50 కోట్లు విడుదలయ్యాయి. 11 అంశాలకు సంబంధించి 110 పనులు చేపట్టారు. 50 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు రెండు మాసాల్లో పూర్తిచేయనున్నారు.
సొంతంగా కూరగాయల సాగు
చిట్టేడులో విద్యార్థుల భోజన అవసరాల నిమిత్తం రూ.5 లక్షలతో కూరగాయలు, ఆకుకూరల సాగుకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులు పండించిన వాటితోనే వంటలు తయారు చేయనున్నారు. రూ.15.58 లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మించారు. వృత్తిశిక్షణకు ఇద్దరు అధ్యాపకులను నియమించారు. మరుగుదొడ్లను వినియోగంలోకి తెచ్చారు.
విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంజినీర్ విభాగం ప్రణాళికాబద్ధంగా ఆయా పాఠశాలల్లో వసతులు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు సమగ్ర శిక్షా ఏఎంవో శివశంకరయ్య తెలిపారు.




