ArticlesNews

ఆపరేషన్ సిందూర్‌కు అంకితమైన కావడి యాత్రలు

271views

ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పరమ శివుడి భక్తులు ప్రతీ యేటా శ్రావణ మాసంలో ‘కావడి యాత్ర’ చేస్తారు. ఆ యాత్ర చేసే వారిని ‘కావడియాలు’ అంటారు. వారు తమ స్వస్థలాల నుంచి హరిద్వార్, గోముఖ్, లేదా గంగోత్రి వంటి ప్రదేశాలకు నడుచుకుంటూ వెడతారు. అక్కడ గంగా నదీ జలాలను కావళ్ళ నిండా పట్టుకుని తిరిగి తమ ప్రదేశాలకు మళ్ళీ కాలి నడకన చేరుకుంటారు. ఆ ప్రయాణంలో వారు కాళ్ళకు చెప్పులు వేసుకోరు. పుణ్యక్షేత్రాలలో తాము సేకరించిన గంగాజలాన్ని తమ స్వస్థలాలలోని శివాలయాలకు తీసుకుని వెడతారు. అక్కడ ఆ గంగాజలంతో పరమశివ భగవానుడికి అభిషేకం చేస్తారు. కావడి యాత్ర అనేది ఔత్తరాహులైన హిందూ భక్తులకు పరమ పవిత్రమైన యాత్రానుభవం. సాక్షాత్తూ పరమశివుడినే కొలుచుకోడానికి దొరికిన అద్భుతమైన, అపురూపమైన అవకాశంగా వారు భావిస్తారు.

ఈ యేడాది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం నుంచి చొరబడిన ఉగ్రవాదులు పహల్‌గామ్ అనే ప్రదేశం దగ్గర అమాయకులైన హిందూ పర్యాటకులను వారి భార్యలు చూస్తుండగా కాల్చి చంపిన ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. ముస్లిం ఉగ్రవాదుల ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం యావత్ భారతదేశమూ కన్నీరు పెట్టింది. దానికి ప్రతిగా భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. పాకిస్తాన్‌లోనూ, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ లోనూ ఉగ్రవాద స్థావరాల మీద దీటైన దాడులు చేసింది. పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దుర్ఘటన, ఆపైన ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన మొదటి కావడి యాత్ర ఇదే. ఆ నేపథ్యంలో పలువురు హిందూ భక్తులు తమ కావడి యాత్రను ఆ నాటి సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కానుకగా అంకితం చేసుకుంటున్నారు. అలాంటి భక్తుల కావడి యాత్రల విశేషాలను పరిశీలిద్దాం.

(1) అమరవీర జవాన్ల స్మరణార్థం 511 అడుగుల జెండాతో కావడి:
ప్రదేశం: ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్
తేదీ: 18-07-2025

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ నుంచి బయల్దేరిన కావడి యాత్రలో భక్తితో పాటు దేశభక్తి కూడా మిళితం అయింది. 43మంది రైతుల బృందం ప్రత్యేకమైన జెండా కావడిని తయారు చేసి దానితో యాత్ర ప్రారంభించింది. ఆ పతాకాన్ని ఏకంగా 511 అడుగుల ఎత్తు ఉండేలా రూపొందించారు. హరిద్వార్‌లో గంగానదీ జలాలను సేకరించి ఆ కావడిని బాగ్‌పత్‌లోని ప్రసిద్ధమూ, ప్రాచీనమూ అయిన మహాదేవ మందిరం వరకూ తీసుకువెడతారు.

ఢిల్లీ డెహ్రాడూన్ జాతీయ రహదారి 58 మీద ఆ రైతుల బృందం భారతీయ సైనికుల ధైర్య సాహసాలకు నివాళులు అర్పిస్తూ ఆ ప్రత్యేక కావడికి రూపకల్పన చేసారు. కావడి మీద ఐదు వందల అడుగులకు పైగా ఎత్తు ఎగురుతున్న ఆ జెండా, కావడి యాత్రికుల మనసుల్లో శివభక్తితో పాటు దేశభక్తి కూడా ఉందనడానికి నిదర్శనంగా నిలిచింది.

(2) పహల్‌గామ్ దాడి బాధితులకు నివాళిగా 101 అడుగుల జెండాతో కావడి యాత్ర:
ప్రదేశం: సహరన్‌పూర్, ఉత్తరప్రదేశ్
తేదీ: 17-07-2025

భోలేనాథుడు పరమశివుడికి శ్రావణ మాస అభిషేకం చేయడం కోసం గంగాజలాన్ని తీసుకువెళ్ళడానికి ఉత్తర ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌ నుంచి ‘సాంబసదాశివ గ్రూప్’ పేరుతో 25 మంది వ్యక్తులు హరిద్వార్ వెళ్ళారు. వారు హరిద్వార్‌లో గంగాజలాలను కావళ్ళలో సేకరించారు.

విశేషం ఏంటంటే వారు 101 అడుగు త్రివర్ణ పతాకంతో తమ కావడి యాత్ర ప్రారంభించారు. ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదులు జరిపిన దాడిలో హతులైన అమాయక హిందూ పర్యాటకులకు నివాళిగా ఆ జెండాను వారు ఎగురవేసారు.

సనాతన సంస్కృతిలో దైవభక్తితో పాటు దేశభక్తికి కూడా సముచితమైన స్థానం ఉంది. ఆ విషయాన్ని నిరూపించేలా వారు హరహర మహాదేవ నినాదాలతో పాటు త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేసారు. హరిద్వార్ నుంచి సహరన్‌పూర్‌ వరకూ తమ కావడి యాత్రలో ఆ జెండాను తీసుకుని వెళ్ళారు.

(3) దేశ రాజధానికి ‘ఆపరేషన్ సిందూర్’ కావడి యాత్ర:
ప్రదేశం: ఢిల్లీ
తేదీ: 13-07-2025

పవిత్ర శ్రావణ మాసం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీ నుంచి ఆరుగురు యువకులు కావడి యాత్ర కోసం హరిద్వార్ వెళ్ళారు. మహాదేవుడికి అభిషేకం కోసం హరిద్వార్‌లో గంగాజలాలతో తమ కావడులు నింపుకున్నారు. అక్కడి నుంచి తిరిగి వెనక్కు వెళ్ళే సమయంలో వారు చేసిన పని చూపరుల కళ్ళు చెమ్మగిల్లేలా చేసింది.

ఆ యువకులు తమ కావడికి రెండు వైపులా రెండు బొమ్మలు ఏర్పాటు చేసారు. ఒకటి భారత వైమానిక దళం జవాను బొమ్మ, మరొకటి సరిహద్దు రక్షక దళం (బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ – బిఎస్ఎఫ్) జవాను బొమ్మ. ఆ రెండు బొమ్మలకూ తగిన యూనిఫాంలు కూడా తొడిగారు. కావడి పైన ‘ఆపరేషన్ సిందూర్ – పహల్‌గామ్ అమరుల స్మృతిలో’ అని రాసి ఉన్న బోర్డు కూడా పెట్టారు. దానిమీద ఎగురుతున్న మువ్వన్నెల జెండా చూపరులకు స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. ‘‘కావడి అనేది కేవలం అభిషేకం కోసం గంగాజలం మాత్రమే కాదు, అది శ్రద్ధకు, గౌరవానికీ ప్రతీక.’’

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ఆ యువకుల కావడి యాత్ర, పహల్‌గామ్ అమరులకు శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు సమాజంలో సైన్యం పట్ల ఉన్న గౌరవం, ఆదర భావాలకు ఒక కొత్త దిశను చూపింది.

(4) బ్రహ్మోస్ శకటంతో కావడి యాత్ర
ప్రదేశం: న్యూఢిల్లీ
తేదీ: 08-07-2025

పహల్‌గామ్‌లో పాకిస్తానీ ముస్లిం ఉగ్రవాదుల మతోన్మాద దాడిలో అమాయక హిందువులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశ ప్రజలందరినీ కలచివేసింది. ఆ దాడికి ప్రతీకారంగా భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. అందులో బ్రహ్మోస్ క్షిపణి వినియోగం భారీగా విజయవంతమైంది.

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌ భూభాగాలలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంలో బ్రహ్మోస్ మిసైల్ ప్రయోగం సంచలనం సృష్టించింది. అంతేనా, బ్రహ్మోస్ గర్జన ప్రపంచం మొత్తం ప్రతిఫలించింది. దాని శక్తిసామర్థ్యాలను చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయింది. అలాంటి బ్రహ్మోస్ క్షిపణి కావడి యాత్రకూ వచ్చేసింది.

న్యూఢిల్లీలోని పాలం కాలనీ, మంగళ్‌పురి ఫేజ్ టూ నుంచి కావడి యాత్రకు బయల్దేరిన యువకుల బృందం బ్రహ్మోస్ క్షిపణి నమూనాను కూడా ఊరేగించింది. ఆ యువకులు బ్రహ్మోస్ మిసైల్‌తో పాటు పరమ శివుడి ప్రతిమ, కాషాయ ధ్వజం, త్రివర్ణ పతాకాలను కూడా యాత్రలో తీసుకుని వెళ్ళారు. హరిద్వార్ నుంచి ఢిల్లీ చేరే వరకూ ఈ బ్రహ్మోస్ క్షిపణితో కూడిన కావడి, చూపరులను అమితంగా ఆకట్టుకుంది.

(5) రాఫేల్ యుద్ధవిమానం కావడి:
ప్రదేశం: హరిద్వార్, ఉత్తరాఖండ్
తేదీ: 17-07-2025

కావడి యాత్రల్లో భాగంగా కనిపించిన మరో ప్రత్యేక ఆకర్షణ రాఫేల్ యుద్ధవిమానం నమూనాతో కూడిన కావడి. అందులో శివ భగవానుడి మూర్తి, భారతీయ సైనికుల పోస్టర్‌లతో పాటు భారత జాతీయ పతాకం కూడా ఉంది. వాటన్నిటితో కూడిన శకటం పరమశివ మహాదేవుడి పట్ల భక్తితో పాటు దేశభక్తికి కూడా చిహ్నంగా నిలిచింది. అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ, భారత సైన్యం సాధించిన విజయాలకు హర్షం వ్యక్తం చేస్తూ, ప్రజలకు ఉగ్రవాదం గురించి అప్రమత్తంగా ఉండాలన్న సందేశం అందిస్తూ హరిద్వార్‌లో కనిపించిన ఆ శకటం ప్రజలను అమితంగా ఆకట్టుకుంది.

(6) ఒక కాలు లేకపోతేనేం, దైవం మీద దేశం మీద భక్తి ఉంది:
ప్రదేశం: శాహదరా, ఢిల్లీ
తేదీ: 12-07-2025

ముఖేష్ ఠాకూర్ ఢిల్లీలోని శాహదరా ప్రాంతంలో ఛజ్జూపూర్ కాలనీ నివాసి. కావడి యాత్ర చేసే మిగతా భక్తులతో పోలిస్తే ముఖేష్ ప్రత్యేకమైన వాడు. ఎందుకంటే అతను దివ్యాంగుడు. అతనికి ఒక కాలు కృత్రిమ కాలు. అయినప్పటికీ ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్ళి అక్కడినుంచి కావడి మోసుకుని మళ్ళీ వెనక్కు యాత్ర చేసుకుంటూ వెళ్ళాడు. అంతేకాదు, 22 ఏప్రిల్ 2025న పహల్‌గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో అమరులైన 26మంది అమాయక సామాన్య పౌరులకు, దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న భారత సైన్యంలోని వీరులకూ తన కావడి యాత్రను అంకితం చేసాడు.

ముఖేష్ కథ ఏమిటి? కొన్నాళ్ళ క్రితం అతను ఒక ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు అతని కాలు పొరపాటున బైటకు వచ్చింది. అదే సమయంలో పక్కనుంచి వచ్చిన మరో ఆటో అతన్ని ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ముఖేష్ కాలు పోయింది. అయినా అతను ధైర్యం కోల్పోలేదు. ఇప్పుడు కూడా అతను ఇ-రిక్షా నడుపుతున్నాడు, మోటార్ సైకిల్ కూడా నడపగలడు. ఆ ప్రమాదం తర్వాత ముఖేష్, తనను చూసి ఇతర దివ్యాంగులు ప్రేరణ పొందాలి అంటూ వారికి పిలుపునిచ్చాడు. ‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు, ప్రయత్నం చేయాలి, అప్పుడు దైవం మనకు తప్పక సహాయం చేస్తాడు’ అన్నది ముఖేష్ భావన.

ముఖేష్ ఠాకూర్‌ దివ్యాంగుడు అయినప్పటికీ కావడి యాత్ర చేపట్టే ధైర్యం ఎలా చేసాడు? అతను కొన్నాళ్ళ క్రితమే కాలి నడకన వైష్ణోదేవి ఆలయానికి వెళ్ళి వచ్చాడు. ఆ ఆలయ యాత్రను సమర్ధంగా పూర్తి చేయగలగడం ముఖేష్‌కు తన మీద తనకే విశ్వాసం కలిగేలా చేసింది. హరిద్వార్‌లో గంగాజలం సేకరించి ఆ నీటితో శాహదరాలో ఉన్న శివాలయంలో అభిషేకం చేయడానికి కావడి యాత్ర చేపట్టాడు. అతను తన యాత్రను పహల్‌గామ్‌లో అమరులైన వారికి, మన దేశపు వీర జవాన్లకూ అంకితం ఇచ్చాడు.

(7) వీర నారీమణులకు కావడి యాత్ర అంకితం:
ప్రదేశం: ఫరీదాబాద్, హరియాణా
తేదీ: 15-07-2025

పరమ పవిత్రమైన శ్రావణ మాసంలో, దేవభూమిగా పిలిచే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రధాన నగరమైన హరిద్వార్‌కు కావడి యాత్ర కోసం లక్షలాది భక్తులు వెడతారు. అక్కడినుంచి గంగాజలం సేకరించి తమ స్వస్థలాలలోని శివాలయాల్లో పరమశివుడికి అభిషేకం చేస్తారు. అలాంటి హరిద్వార్‌లో ఈ యేడాది ఒక ప్రత్యేకమైన కావడి యాత్ర కనిపించింది.

పహల్‌గామ్‌లో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ హిందువులను కాల్చి చంపిన ఘటన దేశ ప్రజలు అందరినీ కదిలించి వేసింది. ఆ ఉగ్రదాడికి స్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. దానిలో క్రియాశీలంగా పాల్గొన్న వారిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. ఆ ఆపరేషన్ గురించి బాహ్య ప్రపంచానికి మొదటిసారి చెప్పిన ఆ ఇద్దరు మహిళల పేర్లు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీ.

వ్యోమిక, సోఫియా దేశభక్తికి గుర్తుగా ఈ యేడాది కావడి యాత్రలో వారిద్దరికీ చోటు దక్కింది. హరియాణాలోని ఫరీదాబాద్ నుంచి బయల్దేరిన ఒక కావడి యాత్రికుల బృందం, తమ తిరుగు ప్రయాణంలో గంగాజలంతో కూడిన కావడితో పాటు వ్యోమికా, సోఫియాల చిత్రపటాలు ఉంచారు. ‘ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సివంగులు’ అంటూ వారిని స్మరించుకుంటూ శివ పరమాత్ముణ్ణి తలచుకుంటూ కావడి యాత్ర పూర్తి చేసారు.

ఉపసంహారం:
ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి ఉగ్రవాద దాడుల్లో అయినా ప్రధానంగా ఒక మతానికి చెందిన వారే ఉండడం అందరికీ తెలిసిందే. కానీ చాలామంది సోకాల్డ్ సెక్యులరిస్టులు ఉగ్రవాదానికి మతం లేదు అని కబుర్లు చెబుతుంటారు. వారి గాలి తీసేసేలా పహల్‌గామ్ దాడి ఘటనలో ఉగ్రవాదులు పురుషుల దుస్తులు విప్పివేసి వారి మతం ఏమిటో తెలుసుకుని మరీ హిందువులను హత్య చేసారు. దానికి ప్రతీకారం తీర్చుకోడానికి భారతదేశం ‘ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది.

సగటు భారతీయుడు ‘ఆపరేషన్ సిందూర్‌’ విజయవంతం అవడంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. తానే స్వయంగా యుద్ధభూమిలో నిలబడి ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అభినందనలు తెలియజేసారు. ఆ పద్ధతినే కావడి యాత్రకు సైతం అమలు చేసారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా తమదైన సృజనాత్మక కోణాన్ని బైటకు తీసి, పరుగులు తీయిస్తున్నారు.