News

ఆరోగ్య భారతి స్ఫూర్తి అందిపుచ్చుకోవాలి

297views

రాష్ట్రంలో ఆరోగ్య భారతి అందిస్తున్న సేవలను స్ఫూర్తిగా తీసుకుని ఇతర స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకురావాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. ఆరోగ్య భారతి ఆంధ్రప్రదేశ్‌ కార్యకర్తల ప్రాంత అభ్యాసవర్గ సమావేశం గుంటూరు అమరావతి రోడ్డులోని హిందూ ఫార్మసీ కళాశాలలో జరిగింది. మంత్రి సత్యకుమార్‌ మాట్లాడుతూ ఆరోగ్య భారతిని ప్రారంభించి 23 ఏళ్లు పూర్తయిందన్నారు. దేశంలో 92 శాతం జిల్లాల్లో ఆరోగ్య భారతి కార్యకర్తలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 600 మందికి పైగా పని చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆయుష్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేయనుందన్నారు.

రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఆరోగ్య సంరక్షణ కల్పించడమే బాధ్యతగా పని చేస్తున్నానన్నారు. 2030 నాటికి హెర్బల్‌ ఉత్పత్తుల ఎగుమతిలో దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. 2023లో జరిగిన సర్వేలో క్యాన్సర్‌ రోగులు 73 శాతం మంది దేశంలో ఉన్నారని, అందుకు ప్రధాన కారణం మన ఆహార లోపాలేనన్నారు. వాటిలో మార్పులు తీసుకురావాలన్నారు. వేగంగా పెరుగుతున్న క్యాన్సర్‌ వంటి వ్యాధుల నివారణకు ముందు జాగ్రత్తలే ముఖ్యమన్నారు. జీవితంలో వ్యాధుల నుంచి బయటపడాలంటే యోగా ఒక్కటే మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం కోసం ఆరోగ్య భారతి వంటి సంస్థల సహకారంతో పని చేయనున్నట్లు చెప్పారు. డాక్టర్‌ గోపాలకృష్ణ గోఖలే సేవలు ప్రశంసనీయమన్నారు.

అనంతరం ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో రూపొందించిన ఆరోగ్య జీవన విధానం అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరోగ్య భారతి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ పి.ఎస్‌.రావు, జాతీయ సంఘటన కార్యదర్శి డాక్టర్‌ అశోక్‌ కుమార్‌(న్యూదిల్లీ), జాతీయ సహ సంఘటన కార్యదర్శి ఆర్‌.మురళీకృష్ణ(చెన్నై), కె.ఎస్‌.ఎన్‌.చారి, కుమారస్వామి, అశోక్, డాక్టర్‌ పృధ్విరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.