ArticlesNews

ధర్మాధర్మాలు

153views

ఆహార భయ నిద్రా మైథునాలు అన్ని జీవులకూ సమానమైనా, మనిషిని సకల ప్రాణులనుంచీ వేరు చేసేది బుద్ధి లేదా యుక్తాయుక్త విచక్షణ అనే ప్రజ్ఞ. దీని ప్రధాన లక్షణం మానవత్వ పరిరక్షణ. అదే ధర్మం. దీనికి విరుద్ధమైందే అధర్మం. ధర్మాన్ని సమర్థంగా ఆచరించబట్టే, ఈ దేశానికి ధర్మక్షేత్రమని పేరు. ఇది సనాతన ధర్మం ద్వారా, పురాణేతిహాసాల ద్వారా జనజీవితాల్లో భాగమవుతూ వచ్చింది.

ధర్మం కర్తవ్య, నీతి నియమాలకు ప్రతీక. అధర్మం అసత్య, అన్యాయాలకు ఆలవాలం. వేదానికి, ధర్మానికి భేదమే లేదు. ధర్మనిష్ఠలో రాముణ్ని మించినవారు లేరు. అందుకే ‘పది కొంపలును లేని పల్లెనైనను, రామభజన మందిర మొండు వరలుగాత’ అంటూ కౌసల్యాసుతుణ్ని కీర్తిస్తారు. అశ్వత్థామ హతః అని బిగ్గరగా, కుంజరః అని ధర్మజుడు నెమ్మదిగా అన్నా; శరాఘాతానికి గాయపడి తన వైపు వచ్చిన పంది జాడను ప్రశ్నించిన వేటగాడితో ‘చూసే కన్ను మాట్లాడదు, మాట్లాడే నోరు చూడలేదు’ అంటూ పోతన అస్పష్టంగా చెప్పినా ధర్మాన్ని కాపాడడానికే. ఒక్కోసారి ధర్మాధర్మాల విభజన రేఖ స్పష్టంగా కనపడదు. ధర్మ పరిరక్షణలో దీక్షాపరుడు అనదగ్గ ధర్మజుడు అంతటివాడు, జూదంలో ‘తన్నోడి నన్నోడెనా, నన్నోడి తన్నోడెనా’ అన్న ద్రౌపది ప్రశ్నకు తడబడ్డాడు. వస్త్రాపహరణను కర్ణుడు ఎగదోసినా, అదే పక్షంలోని వికర్ణుడు వ్యతిరేకిస్తూ శాస్త్రప్రకారం స్పష్టంగా ధర్మం చెప్పాడు. లాభ లోభ పక్షపాతాలతోనో, ఊగిసలాడే బుద్ధితోనో తెలిసి కూడా ధర్మం చెప్పకపోతే, అసత్య దోష ఫలం ప్రాప్తిస్తుందని విదురుడు వివరించాడు.

ఆవేశమూ ఆగ్రహమూ కలిగినప్పుడు ధర్మాధర్మాలు వివరించి చెప్పగలిగే తోడు ఉండటం అదృష్టం. మొత్తం భారతం సారాంశాన్ని ఒకే శ్లోకంలో చెప్పమని, దాన్ని రాస్తున్న వినాయకుడు వ్యాసుణ్ని ప్రశ్నిస్తాడు. ‘ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, అపకారం చేయడం పాపం’ అని అర్ధశ్లోకంలో ధర్మం చెబుతాడు వ్యాసుడు. సమస్త సృష్టితో కలిసి జీవించమని ధర్మం బోధిస్తోంది. ఎప్పుడైతే ప్రేమను విస్మరిస్తామో అప్పుడే సంఘర్షణలు మొదలవుతాయి. ఓ వ్యక్తిపై మరో వ్యక్తికుండే ప్రేమే అందరి మీదా ప్రసరించడాన్ని కరుణ అంటారు. ఆ కరుణే సమస్త ధర్మాల సారం. ధర్మం ఒక చెట్టయితే కరుణ దానికి మూలం.

ధర్మో రక్షతి రక్షితః అన్నది ఆర్యోక్తి. ధర్మాన్ని రక్షిస్తే, అదే మనల్ని రక్షిస్తుంది. ధర్మం తప్పనివారి పాలనలో దేశం సుభిక్షంగా ఉంటుంది. ధర్మానికి హాని కలిగినప్పుడల్లా, దాన్ని కాపాడటానికి అవతరిస్తానని గీతాచార్యుడు చెప్పాడు. అధర్మంలో మోసం, హింసలు దాగి ఉంటే- ధర్మంలో సత్యం, దయ, శాంతి, మంచి నడవడి, న్యాయం నిండి ఉంటాయి. అందుకే అది అందరికీ ఆచరణీయం.