
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుల ఆగడాలు ఇటీవల ఎక్కువైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖలిస్థానీ తీవ్రవాద శక్తులు జాతీయ భద్రతకు ముప్పేనని కెనడా నిఘా విభాగం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకటించింది. దేశంలో హింసాత్మక తీవ్రవాద అజెండాను ప్రచారం చేయడానికి స్థానిక వ్యవస్థలను వాడుకుంటున్నాయని తాజా నివేదికలో వెల్లడించింది.
‘‘కొన్ని ఖలిస్థానీ తీవ్రవాద శక్తులు (CBKE) స్థానికులతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాయి. హింసాత్మక తీవ్రవాద అజెండాను ప్రచారం చేసేందుకు స్థానిక వ్యవస్థలను ఉపయోగించుకుంటున్నాయి. అమాయకుల నుంచి నిధులు సేకరించి.. వాటిని హింసాత్మక కార్యక్రమాలకు మళ్లిస్తున్నాయి’’ అని పబ్లిక్ రిపోర్ట్ -2025లో కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (CSIS) పేర్కొంది.
1985లో ఎయిరిండియా విమానం ‘కనిష్క’ బాంబు దాడికి గురైన ఘటనలో 329 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మరణించిన వారిలో ఎక్కువగా కెనడియన్లే ఉన్నారు. ఈ దాడికి ఖలిస్థానీ వేర్పాటువాద శక్తులే కారణమనే ఆరోపణలున్నాయి.
అయితే, తాజా నివేదికలో ఖలిస్థానీ శక్తుల చర్యలను ముప్పుగా పేర్కొన్నప్పటికీ.. వాళ్లు అహింసాత్మక మార్గంలో వెళ్లడం తీవ్రవాదంగా పరిగణించబోమని పేర్కొంది. భారత్‌లో హింసను ప్రోత్సహించడానికి, నిధులను సేకరించడానికి లేదా ప్రణాళికలను రచించడానికి కెనడాను వేదికగా చేసుకునే కొంతమందినే ఖలిస్థానీ తీవ్రవాదులుగా పరిగణిస్తామని పేర్కొనడం గమనార్హం.





