News

భారత్‌పై పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తీవ్ర ఆరోపణలు

0views

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్, భారత్‌పై సరికొత్త కుట్రపూరిత వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తన దేశంలో తెహ్రీక్-ఏ-తాలిబన్ (టీటీపీ), బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) జరుపుతున్న దాడుల వెనుక భారత్ హస్తం ఉందంటూ తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. పాకిస్థాన్ స్వయంకృతాపరాధమే ఈ సమస్యలకు కారణమని స్పష్టంగా తెలుస్తున్నా, మునీర్ ఈ ప్రచారాన్ని ఉధృతం చేయడం వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉందని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జైష్-ఏ-మొహమ్మద్, లష్కర్-ఏ-తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలను మళ్లీ భారత్‌పై దాడులకు ఉసిగొల్పడమే ఆయన అసలు ఉద్దేశం.

‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాకిస్థాన్ సైన్యం పరువు కోల్పోవడంతో, ఆసిమ్ మునీర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. పహల్గామ్ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌కు ముందు, “భారత్‌ను తూర్పు నుంచి నాశనం చేయడం ప్రారంభిస్తాం” అంటూ ఆయన గంభీరమైన ప్రకటనలు చేశారు. అయితే, ఆ ఆపరేషన్ విఫలమవడంతో ఇప్పుడు సొంత దేశంలో ఆయనకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ అవమానం నుంచి బయటపడేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు మునీర్ భారత్‌పై నిందలు మోపుతున్నారని అధికారులు చెబుతున్నారు.

ప్రస్తుతం జైష్, లష్కర్ వంటి ఉగ్రవాద సంస్థలు పునరేకీకరణ అవుతున్నప్పటికీ ఆ ప్రక్రియ పాక్ సైన్యం, ఐఎస్ఐ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఐఎస్ఐ నిధులు, వనరులు సమకూరుస్తున్నా, ఆ సంస్థల నాయకత్వంలో నైతిక స్థైర్యం కొరవడిందని, భారత్‌పై వెంటనే దాడులు చేసేందుకు అవి విముఖంగా ఉన్నాయని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వారిలో భారత్‌పై ద్వేషాన్ని మరింత తీవ్రతరం చేసి, దాడులకు పురిగొల్పేందుకే మునీర్ ఈ ఆరోపణల పర్వాన్ని ఎంచుకున్నారని తెలుస్తోంది.

మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లతో యుద్ధం విషయంలోనూ మునీర్ అనుసరించిన వ్యూహం బెడిసికొట్టింది. ఆ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి కూడా భారత్‌పై విమర్శలు ఆయనకు ఒక ఆయుధంగా మారాయి. కశ్మీర్‌లో దాడులు చేయడంలో అనుభవం ఉన్న లష్కర్, జైష్‌లను రంగంలోకి దించకుండా పాకిస్థాన్ తన ప్రాక్సీ యుద్ధాన్ని కొనసాగించలేదు. అందుకే ఆ సంస్థలలో మళ్లీ కసి రగిలించేందుకు మునీర్ ఈ ప్రచారాన్ని వాడుకుంటున్నారు.

భారత సైన్యం సరిహద్దుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండటంతో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలన్నీ విఫలమవుతున్నాయి. అయినప్పటికీ, పాకిస్థాన్ నిస్పృహలో ఉందని, మునీర్ రెచ్చగొట్టే ప్రసంగాల నేపథ్యంలో కశ్మీర్‌లో ఒక భారీ దాడికి తెగించే ప్రమాదం ఉందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.