News

‘నోబెల్‌’ నామినేషన్ల జాబితాలో ‘ప్యాడ్‌ మ్యాన్‌’ మురుగానందం పేరు

38views

రుతుస్రావం సమయంలో మహిళల పరిశుభ్రత కోసం తక్కువ ధరకు శానిటరీ న్యాప్‌కిన్లు అందించే యంత్రాన్ని కనుగొన్న అరుణాచలం మురుగానందం పేరు.. ఈ ఏడాది నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అయింది. నోబెల్‌ కమిటీ.. 2026 శాంతి బహుమతి కోసం 79 సంస్థలతో పాటు 287 మంది నుంచి వ్యక్తిగత నామినేషన్లను స్వీకరించింది. వాటిని పరిశీలించి అక్టోబరు 9న పురస్కారాన్ని ప్రకటించనుంది. ఆ నామినేషన్ల జాబితాలో తన పేరు ఉన్నట్లు మురుగానందం స్వయంగా ప్రకటించారు. ‘నేను కానీ నా కుటుంబసభ్యులు కానీ నోబెల్‌ కోసం నామినేషన్‌ వేయలేదు. పుదుచ్చేరిలోని అరవింద్‌ కంటి ఆసుపత్రికి చెందిన ఓ డీన్‌తో పాటు అక్కడ పని చేస్తున్న అమెరికన్‌ వైద్యబృందాల సభ్యులు నా పేరును నామినేట్‌ చేశారు. ఇది నాకెంతో గర్వకారణం’ అని మురుగానందం చెప్పారు. ‘40 ఏళ్లుగా శానిటరీ న్యాప్‌కిన్ల తయారీలో ఉన్నాను. దేశవ్యాప్తంగా మహిళల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాను. అతితక్కువ ఖర్చుతో కూడిన తయారీ సాంకేతికతను, యంత్రాల్ని 40కి పైగా దేశాలకు అందించాను’ అని వివరించారు.

నాలుగు సినిమాలు..

కోయంబత్తూర్‌కు చెందిన మురుగానందం జీవితచరిత్రను ‘ప్యాడ్‌ మ్యాన్‌’ పేరుతో బాలీవుడ్‌లో సినిమాగా తెరకెక్కింది. ఇందులో మురుగానందం పాత్రను ప్రముఖ నటుడు అక్షయ్‌కుమార్‌ పోషించారు. మహిళల ఇబ్బందులకు మురుగానందం చూపిన పరిష్కారాలు నేపథ్యంగా 2013-18 మధ్య 4 సినిమాలు వచ్చాయి. ఆయనకు కేంద్ర ప్రభుత్వం 2016లో పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.